చెల్లిని చూసేందుకు వెళ్తూ...
► విజయనగరం ఆర్‌కే. టౌన్‌షిప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
► ఆర్టీసీ హయ్యర్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ, వ్యక్తి మృతి
► విజయనగరం ఆర్‌కే. టౌన్‌షిప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
► ఆర్టీసీ హయ్యర్ బస్సు, ద్విచక్రవాహనం ఢీ, వ్యక్తి మృతి
► మృతుడు బలిజిపేట మండలం నూకలవాడ వాసి
► ప్రమాదంలో తెగి పడిన తల
► గుండెలవిసేలా రోదిస్తున్న మృతుని భార్య, కుటుంబ సభ్యులు
ఆయనో ఆటో డ్రైవర్.. తనే కుటుంబానికి పెద్దదిక్కు. గ్రామస్థులకు, అన్నదమ్ములకు అన్ని పనుల్లో సాయం చేస్తూ తలలో నాలుకలా వ్యవహరిస్తుండేవాడు. తోడ పుట్టిన చెల్లిని చూసేందుకని ఇంటి నుంచి బయలు దేరి వెళ్లాడు. అంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించాడని వార్త గ్రామానికి చేరింది. ఇప్పుడే బయలు దేరిన వ్యక్తి గంటల వ్యవధిలో విగత జీవుడయ్యాడని తెలిసి కుటుంబ సభ్యులు బోరున రోదిస్తున్నారు. ఆ ఊర్లో విషాదచాయలు అలుముకున్నాయి. విధి ఆడిన వింత నాటకంతో ఆయన పిల్లలు, భార్య దిక్కులేని వారయ్యారు.
నూకలవాడ(బలిజిపేట రూరల్)/ విజయనగరం టౌన్ : తోడ పుట్టిన సోదరిని చూసేందుకు బయలు దేరిన వ్యక్తి ఇంటి నుంచి బయలు దేరిన కొద్ది గంటల్లోనే విగత జీవుడు కావడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఊర్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామంటూ మృతుని భార్య కన్నీరు మున్నీరవుతుంటే ఆమెను ఆపడం ఎవరి తరం కావడం లేదు. తమను పోషించే వాడే లేకపోతే ఎలా బతికేదని ఆ ఇల్లాలు, పిల్లలు రోదిస్తున్న తీరు చూసి అక్కడున్న వారి అందరి కళ్లలో న్నీళ్లు తిరుగాయి. దీనిపై విజయనగరం రూరల్ పోలీసులు అందించిన వివరాల్లోకి వెళ్తే.. బలిజిపేట మండలంలోని నూకల వాడ గ్రామానికి చెందిన వావిల పల్లి రాంబాబు (32) సోమవారం ఉదయం విశాఖపట్నంలో ఉన్న చెల్లిలి ఇంటికి తన బైక్‌పై బయలు దేరారు.
సరిగ్గా విజయనగరం మండలంలోని ఆర్‌కే. టౌన్ షిప్ వద్ద ఉన్న ఒడిశా దాబా వద్దకు వచ్చేసరికి లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ హయ్యర్ (ఏపీ 35 ఎక్ 5473) బస్సును గమనించ కుండా బస్సును బలంగా ఢీకొట్టి, బస్సు కిందకు వెళ్లిపోయారు. ఆ సమయంలో బస్సు బంపర్ తగిలి ఆయన మెడ, మొండెం వేరయ్యాయి. శరీరం అంతా బస్సు కిందకు వెళ్లిపోయి, హెల్మెట్‌తో ఉన్న తల బయటకు వచ్చింది. ఆ దృశ్యం చూసిన అక్కడి వారు ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యారు. బస్సు డ్రైవర్ కూడా బ్రేక్ వేయడంతో బస్సు పక్కకు ఒరిగిపోయింది. రూరల్ ఎస్.ఐ సింహాచలం నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో నడుపుతూ జీవనోపాధి..
రాంబాబు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి, భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలు వంశీ, అజయ్ పోషణకు ఆయనే ఆధారం. పెద్దగా భూములు ఏవీ లేవు. అన్నదమ్ములకు, కుటుంబానికి, గ్రామస్థులకు ఏ పనిలోనైనా రాంబాబు తలలో నాలుకలా ఉండేవాడు. అలాంటి రాంబాబు ఇక లేడు అన్న వార్తను ఆ గ్రామస్థులు ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.
అభం శుభం తెలియని చిన్నారులు..
ఆడుతూ, పాడుతూ తిరుగుతున్న చిన్నారులకు విధి బస్సు రూపంలో వెంటాడి వారి తండ్రిని వారికి కాకుండా చేసింది. మృతుని కుమారులు వంశీ, అజయ్‌లు తల్లి ఏడుస్తుంటే ఎందుకు రోదిస్తుందో తెలియక బేల చూపులు చూస్తున్నారు. బంధువులు తమను లాలిస్తుంటే ఎందుకు వారు అలా చేస్తున్నారో అర్థం కాక వారు చూస్తున్న అమాయకపు చూపులు అక్కడి వారిని కట్టిపడేస్తున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయిన వారి కుటుంబం ఎలా బతుకుతుందోనని స్థానికులు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు.