అనంతపల్లి(నల్లజర్లరూరల్) : అతివేగం మూడు ప్రాణాలను బలిగొంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా వాసులే. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కటికాల శ్రీనివాసరావు(46), అదే మండలం ముత్యాలమ్మపాడుకు చెందిన మద్దినేని వెంకటకృష్ణ(28), గురజాల మండలం పులిపాడుకు చెందిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు(38) విశాఖ జిల్లా పరవాడ సమీపంలోని దిబ్బలగొర్లవానిపాలెంలో ఒక పెట్రోల్ బంకు లీజు వ్యవహారంపై ఆదివారం రాత్రి ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లారు.
అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తుండగా, నల్లజర్ల మండలం అనంతపల్లి శివారున ఎదురుగా కూల్‌డ్రింక్స్ లోడుతో వెళ్తున్న మినీలారీ డ్రైవర్ నల్లజర్ల మండలం నబీపేట వెళ్లడానికి మలుపు తిరగాల్సి రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ సమయంలో వెనుక వస్తున్న కారు మినీలారీని ఢీకొని ఆగింది. ఇంతలో వెనుక వేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన లారీ కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.
అందులో ప్రయాణిస్తున్న కటికాల శ్రీనివాసరావు, అదే మండలం ముత్యాలమ్మపాడుకు చెందిన మద్దినేని వెంకటకృష్ణ, గురజాల మండలం పులిపాడుకు చెందిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు దుర్మరణం పాలయ్యారు. కారు డ్రైవర్ బాషానాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా ప్రాంతం రక్తసిక్తమైంది. మృతదేహాలు కారు శకలాల్లో ఇరుక్కుపోయాయి. భయానక వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది.
విషయం తెలియగానే అనంతపల్లి ఎస్‌ఐ నాయక్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గడ్డపలుగులతో కారు శకలాలను తొలగించి అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. తాడేపల్లిగూడెం సీఐ జి.మధుబాబు, కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో హాహాకారాలు
పెంటపాడు : ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురినీ పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం ఆస్పత్రి సూపరింటెండెంట్ వసంతం జనార్దన్ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదం గురించి తెలియగానే గుంటూరు జిల్లా నుంచి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు 30 కార్లలో ఆస్పత్రికి చేరారు. వారి హాహాకారాలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. నల్లజర్ల మండలం అచ్చెనపాలెం గ్రామసర్పంచ్ బి.వెంకటసుబ్రమణ్యచౌదరి, అనంతపల్లికి చెందిన పలువురు ఏరియా ఆస్పత్రి వద్ద మృతుల బంధువులకు సహాయసహకారాలు అందించారు.
ఉసురుతీసిన అతివేగం!
Published Wed, Apr 20 2016 12:10 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement