మావోయిస్టులు ఎన్ని పోస్టర్లు వేసినా, బ్యానర్లు కట్టినా..
సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం ఆగదు
చర్ల, న్యూస్‌లైన్:
మావోయిస్టులు ఎన్ని పోస్టర్లు వేసినా.. బ్యానర్లు కట్టినా సరిహద్దు గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు ఎట్టి పరిస్థితిలో ఆగవని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆయన శనివారం చర్ల పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలకు చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. వీటి నిర్మాణాన్ని భారీ భద్రత నడుమ సాగిస్తున్నట్టు చెప్పారు. తమను అణిచివేసేందుకే వీటిని నిర్మిస్తున్నారని మావోయిస్టులు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ‘మావోయిస్టులను అణివేసేందుకు పోలీసులకు రోడ్ల సౌకర్యం అవసరం లేదు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్ల ప్రదేశాలకు రహదారులు ఎక్కడున్నాయి’ అని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణ పనులకు భారీ భద్రత కల్పిస్తున్నామన్నారు. ఈ క్రమంలో బలగాలపై దాడులకు దిగేందుకు మావోయిస్టులు వ్యూహాలు పన్నుతున్నట్టుగా తమ దృష్టికి వస్తోందన్నారు.
‘వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు మేం కూడా మా శైలిలో ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకున్నాం’ అని చెప్పారు. భద్రత నడుమ హడావిడిగా సాగుతున్న ఈ పను ల్లో నాణ్యత ఉండదంటూ జరుగుతున్న ప్రచారం లో వాస్తవం లేదన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని, వారి కార్యకలాపాలను మున్ముందు పూర్తిగా నిరోధిస్తామని అన్నారు. జిల్లాలో నల్లబెల్లం అమ్మకాలు పూర్తిగా తగ్గాయన్నారు. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు చెప్పా రు. ఎన్నికల నాటికి ఏజెన్సీలోకి కేంద్ర పారా మిలటరీ బలగాలను రప్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు భద్రాచలం సబ్ డివిజన్‌లో అత్యంత సాహసోపేతంగా పనిచేసి సఫలీకృతులైన ఎస్సైలందరినీ ఎన్నికల అనంతరం మంచి స్థానాలకు కేటాయించనున్నట్టు తెలిపారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కెఆర్‌కె.ప్రసాదరావు, ఎస్సై దోమల రమేష్ పాల్గొన్నారు.
ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి
ప్రజల సహకారముంటే గ్రామాలు పూర్తిస్థాయి లో అభివృద్ధవుతాయని ఎస్పీ రంగనాథ్ అన్నా రు. చర్లలోని గాంధీ సెంటర్ నుంచి పూసుగుప్ప వరకు పీఎంజీఎస్‌వై కింద ఎనిమిదికోట్ల రూపాయల అంచనా వ్యయంతో 17 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్డు పనులను ఆయన శనివారం పరిశీ లించారు. రోడ్ల నిర్మాణం సాగుతున్న వద్దిపేట, ఉంజుపల్లి, లెనిన్‌కాలనీ, పూసుగుప్ప గ్రామాల్లోని ఆదివాసీలతో ఆయన మాట్లాడారు. రోడ్ల నిర్మాణాలకు, సంక్షేమ పథకాల అమలుకు మా వోయిస్టులు అడ్డుతగులుతున్నారని చెప్పారు. దీనిని ఆదివాసీలు గుర్తించాలన్నారు. ఎస్పీ వెంట సీఆర్‌పీఎఫ్ డీఐజీ మహేష్ లడ్డా, ఏఎస్‌పీ ప్రకాశ్‌రెడ్డి, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ చోటాన్ ఠాకూర్, అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్, వెంకటాపురం సీఐ కెఆర్‌కె.ప్రసాద్, ఎస్సై దోమల రమేష్ తదితరులున్నారు.
సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం ఆగదు
Published Sun, Feb 2 2014 2:47 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement