రోడ్డు పనులకు సీఆర్‌పీఎఫ్ భద్రత
నక్సల్స్ దాడుల నుంచి రక్షణకు చర్యలు
ఛత్తీస్‌గఢ్ తరహాలో అనుమతి
రాయ్‌పూర్ సమావేశంలో నితిన్ గడ్కరీ ప్రకటన
హైదరాబాద్: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా రక్షణగా సీఆర్‌పీఎఫ్ బలగాలు రంగంలో దిగనున్నాయి. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలున్న ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణ పనులపై మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షించారు. తెలంగాణ తరపున రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. తీవ్రవాదుల హెచ్చరికలతో చాలా చోట్ల పనులు ముందుకు సాగటం లేదని ధైర్యం చేసి దిగితే, విధ్వంసాలకు పాల్పడుతున్నారని నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నక్సల్స్ వారం రోజుల కిందట ఖమ్మం జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద టిప్పర్లు, రోడ్డు రోలర్‌ను దహన ం చేసిన విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన గడ్కరీ రోడ్డు నిర్మాణ పనుల్లో సీఆర్‌పీఎఫ్ బలగాలను రక్షణగా వాడుకునేందుకు పచ్చజెండా ఊపారు. మావోలు బలంగా ఉన్న చత్తీస్‌గఢ్‌లో వాటి సేవలను ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు. ఐదు హెక్టార్ల వరకు అటవీ అనుమతులు స్థానికంగానే ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని గడ్కరీ హామీ ఇచ్చారు.
తెలంగాణలో పర్యటించండి: తుమ్మల
ఖమ్మం : తెలంగాణలో పర్యటించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని రాష్ర్ట స్త్రీ, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే, రెండో విడతగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పనులకు రూ.1,371 కోట్లను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. మంగళవారం రాయ్‌పుర్‌లో కేంద్రప్రభుత్వం తీవ్రవాదుల ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న పనులపై నిర్వహించిన సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రతిపాదనలు త్వరగా పరిష్కరించాలని చేయాలని కోరారు. జగిత్యాల-కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిని ఖమ్మం వరకు పొడిగించాలని, హైదరాబాదు- శ్రీశైలం జాతీయ రహదారిలో మొదటి 50కి.మీ, 4 లైన్లుగా మార్చలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు భారీగా నిధులు!
నక్సల్ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 29 పనులు మంజూర వగా అప్పట్లో అవన్నీ ఖమ్మం జిల్లాకే కేటాయించారు. వాటిలో ఇప్పటికే 26 పనులు పూర్తయ్యాయని తుమ్మల, నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు. గోదావరి నదిపై ఏటూరునాగారం ఖమ్మం జిల్లా వాజేడు మండలానికి అనుసంధానంగా నిర్మిస్తున్న వంతెన తుది దశలో ఉందని, హైదరాబాద్-భూపాలపట్నం రోడ్డు అటవీ అనుమతుల వల్ల కాస్త ఆలస్యమైందని, సీలేరుకు అనుసంధానించే రోడ్డు త్వరలో పూర్తికానుందని పేర్కొన్నారు. తొలి విడత పనులు సకాలంలో పూర్తి అయినందున రెండో విడతలో ప్రతిపాదించిన రూ.1371 కోట్ల పనులకు ఆమోదం తెలపాలని గడ్కరీని కోరారు. కొత్తగా 1000 కి.మీ జాతీయ రహదారులకు అనుమతులివ్వాలని, జగిత్యాల-కరీంనగర్-వరంగల్ రహదారిని ఖమ్మం వరకు పొడగించి హైదరాబాద్-శ్రీశైలం రోడ్డులో తొలి 50 కి.మీ.లను నాలుగు లేన్లుగా మార్చాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.