సింహపురి దశ తిరిగేనా?
సాక్షి, నెల్లూరు: సమీపంలో సముద్రం. లెక్కలేనన్ని పరిశ్రమలు. డెల్టాతో అభివృద్ధిలో వ్యవసాయరంగం. ఇక నగర అభివృద్ధిని కళ్లకు కడుతూ కుప్పలుతెప్పలుగా వెలిసిన అపార్ట్‌మెంట్లు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు. వెరసి బయటివారికి నెల్లూరు అందమైన నగరం. ఇదంతా పైకే...చినుకు రాలితే చాలు సింహపురి జలమయమే.
నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థలేదు. రోడ్లన్నీ నీటిగుంటల మయం. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటిలో మునిగి తేలుతాయి. వాహనాల రాకపోకలకూ అంతరాయం. ఎక్కడి వారక్కడే నిలిచి పోవాల్సిందే. పారిశుధ్యం అధ్వానం, మురికి కూపంగా నగరం, అంటురోగాలతో భయం భయంగా జనం... ఇది సంహపురి పరిస్థితి. దశాబ్దాలపాటు ఆనం సోదరుల పాలనలో నగరం రాత మారలేదు. జనం తలరాత మారలేదు. నెల్లూరుకు భూగర్భ డ్రైనేజీ కలగానే మిగిలియింది.
ఇప్పుడు జిల్లాకు చెందిన బీజేపీ జాతీయనేత ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి కావడంతో సింహపురి వాసుల ఆశలు చిగురించాయి. సొంత జిల్లాకేంద్రం కావడంతో వెంకయ్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు నగరాభివృద్ధికి నిధులిస్తారని జనం నమ్మకంతో ఉన్నారు. కనీసం ఇప్పుడైనా అది ఆచరణకు నోచుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
నెల్లూరు నగరం జనాభా 6.5 లక్షలకు పైగా ఉంది. ఈ నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి కూపంగా మారుతోంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు నగరంలో లోతట్టు ప్రాంతాలైన సండేమార్కెట్, వనంతోపు, రవీంద్రనగర్, బీవీ నగర్,తల్పగిరి కాలనీ, డ్రైవర్స్ కాలనీ, టైలర్స్ కాలనీ, చంద్రబాబునగర్, శ్రామికనగర్, రాఘవేంద్రనగర్, నేతాజీనగర్, ప్రగతినగర్, ఇసుక డొంక, వీఆర్‌సీ, బాలాజీనగర్, మాగుంటలేఅవుట్, రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రధాన వీధుల్లో డ్రైనేజీలు లేక రోడ్లపైనే నీరు నిలుస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది.
పాత కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. దానిని పునరుద్ధరించే పరిస్థితి లేదు. పోనీ కొత్తగా రోడ్ల పునర్నిర్మాణంలో భాగంగా కొత్త డ్రైనేజీలైనా సక్రమంగా నిర్మించారా అంటే అదీలేదు. ఆనం కనుసన్నలలో మెలిగే బినామీ కాంట్రాక్టర్లు అవసరంలేని చోట్ల సైతం నాసిరకంగా రోడ్లేసి అందిన కాడికి దండుకున్నారు. వానొస్తే చాలు నీరు బయటకు వెళ్లడంలేదు. ఇక నగరం పరిధిలో ఉన్న పంటకాలువలు సైతం అధికార పార్టీనేతలు కబ్జాచేసి ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించి కోట్లు దండుకున్నారు. దీంతో అవికూడా కనుమరుగయ్యాయి. పర్యవసానంగా వర్షం నీరు, డ్రైనేజీ నీరు రోడ్లపైనే నిలుస్తోంది.
ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సైతం కార్పోరేషన్ అధికారులు సరిగ్గా పర్యవేక్షించడంలేదు. డ్రైనేజీలలో ఒకసారి పూడికతీతకు కార్పొరేషన్ వారు రూ.2 కోట్ల పైచిలుకు ఖర్చులు చూపించి పనులు చేయకుండానే బిల్లుల రూపంలో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పిల్ల కాలువలలో రెగ్యులర్ క్లీనింగ్‌ను సైతం గాలికి వదిలారు. ఇన్నాళ్లు ఆనం సోదరుల కనుసన్నలలో పనిచేసిన కార్పొరేషన్ అధికారుల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి.
అడ్రస్ లేని భూగర్భ డ్రైనేజీ
నెల్లూరు నగరానికి భూగర్భ డ్రైనేజీ కలగానే మిగిలింది. తొలుత పులిమి శైలజ మేయర్‌గా ఉన్న సమయంలో భూగర్భ డ్రైనేజీ కోసం ప్రయత్నించారు. అప్పటి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హామీ మేరకు రూ.250 కోట్లతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి పంపారు. కేంద్రం ఓకే చెప్పినా అప్పట్లో కాంగ్రెస్ నేతలే దీనిని అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి.
తర్వాత భానుశ్రీ మేయర్‌గా ఉన్న సమయంలో రూ.441 కోట్లతో భూగర్భ డ్రైనేజీ అంటూ ప్రకటించారు. తర్వాత అతీగతీ లేదు. అనంతరం కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి నెల్లూరుకు వచ్చిన సందర్భంగా మళ్లీ భూగర్భ డ్రైనేజీ తెరపైకి వచ్చింది. రూ.600 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, మరో రూ.300 కోట్లతో వరద నీటి కాలువ అంటూ శంకుస్థాపన కూడా చేశారు. కాని చాలాకాలం దాని ఊసేలేదు. ఆ తర్వాత మళ్లీ భూగర్భ డ్రైనేజీ ప్రచారం తెరపైకి వచ్చింది. 2013లో మళ్లీ భూగర్భ డ్రైనేజీ తెరపైకి వచ్చింది. రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ అంటూ అప్పటి అధికార పార్టీనేతలు ప్రచారం చేశారు. ఆచరణలో మాత్రం దానిఊసేలేదు. జిల్లాలో 70 ఏళ్ల రాజకీయం తమదే అంటూ గొప్పలు పోయిన ఆనం సోదరులు నగరంలో భూగర్భ డ్రైనేజీని మాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మరోమారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడైనా భూగర్భ డ్రైనేజీ నిర్మించి నగర సమస్యను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాల్సిందే.