6,7న రహదారుల దిగ్బంధం | roads to be Blockade on november 6th and 7th against bifurcation:ysrcp | Sakshi
Sakshi News home page

6,7న రహదారుల దిగ్బంధం

Published Wed, Oct 30 2013 2:33 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

6,7న రహదారుల దిగ్బంధం - Sakshi

6,7న రహదారుల దిగ్బంధం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విభజన అంశంపై నవంబర్ ఏడో తేదీన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నిర్విహ ంచనున్న సమావేశాన్ని నిరసిస్తూ నవంబర్ 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి మంగళవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విభజనకు నిరసనగా పార్టీ నిర్ణయించిన ఆందోళన కార్యక్రమాలను వివరించారు.

 

నవంబర్ ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న నరకాసురులను వధించాలని చెప్పారు. నరకచతుర్దశి నవంబర్ 1 వ తేదీ రాత్రి నుంచే ప్రారంభమవుతుం దని, అందువల్ల ఆ రోజు రాత్రి ఏడు గంటలకు రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాగాంధీ, సహకరిస్తున్న టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు, నాటకాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనకు ఆజ్యం పోసిన కేసీఆర్ నాలుగు తలలతో దిష్టిబొమ్మను రూపొందించి దగ్ధం చేయాలని చెప్పారు.
 
 నరకునితో యుద్ధం చేసింది శ్రీకృష్ణుడే అయినా, వధించడంలో కీలక పాత్ర పోషించింది సత్యభామేనని... అందువల్ల ఈ కార్యక్రమంలో మహిళలంతా చురుగ్గా పాల్గొనాలని కోరారు. అదే రోజున ఉదయం గ్రామ సభలు నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి pmosb@nic.in, manmohan@sansad.nic.in ఈమెయిల్స్ ద్వారా ప్రధానమంత్రికి పంపాలని మైసూరా కోరారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే చదవరని, వారికి ఈమెయిల్స్ పట్ల ఉన్న మోజును ఎగతాళి చేయడానికే ఈ మెయిల్స్ పంపాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. కేంద్రంలో అసలు యూపీఏ ప్రభుత్వం అనేదేలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని విమర్శించారు. మెజారిటీకి 40 సీట్లు తక్కువగా ఉన్న బలహీనమైన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని విభజించేంత పెద్ద పని చేసే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ తన చేతిలో ఉన్న అధికారంతో అసెంబ్లీని సమావేశపర్చకుండా రాష్ట్రపతికి పెద్ద లేఖలు రాస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత పట్ల చిత్తశుద్ధి ఉంటే కిరణ్ తక్షణం అసెంబ్లీని సమావేశ పర్చి సమైక్య తీర్మానం చేయాలని మైసూరా డిమాండ్ చేశారు.
 
 

లగడపాటితో అశోక్‌బాబు చర్చలు: కాంగ్రెస్ ఎంపీ లగడపాటి నివాసంలో ఈ నెల 10వ తేదీన జరిగిన సమావేశంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పాల్గొన్నారని.. అందులోనే దత్తపుత్రుడు, కొత్త పార్టీ వంటి అంశాలపై చర్చలు జరిగాయని మైసూరారెడ్డి వెల్లడించారు. వీరి సమావేశంలో ఈ చర్చలు జరిగినట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కు అయ్యారని కాంగ్రెస్‌కు చెందిన లగడపాటి, జేసీ దివాకర్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని విభజించవద్దని తమ అధిష్టానాన్ని ఒప్పించలేక భంగపాటుకు గురైన కాంగ్రెస్ నేతలు జగన్‌పై పడి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు విభజనకు లేఖ ఇచ్చి రాజకీయ ప్రతిష్టను కోల్పోయిన చంద్రబాబు కూడా దిక్కుతోచక జగన్‌పైనే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు పార్టీలూ కుట్రపూరితంగా కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement