'ఏపీ, తెలంగాణ వైఖరితో రాయలసీమకు అన్యాయం'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ కలిసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయినా ఆంధ్రప్రదేశ్ సర్కారు చూస్తూ ఊరుకుందని, ఇప్పుడు మాత్రం రాజకీయ పబ్బం గడుపుకోడానికి కంటితుడుపు చర్యగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రాయలసీమకు జరిగిన అన్యాయంలో ప్రధానపాత్ర టీడీపీదేనని ఆయన విమర్శించారు. రాయలసీమ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎల్లుండి శ్రీశైలం రిజర్వాయర్ను సందర్శిస్తారని మైసూరారెడ్డి చెప్పారు.
నవంబర్ 1న తమ పార్టీ ఏపీ అవతరణ వేడుకలను నిర్వహిస్తుందని మైసూరా రెడ్డి తెలిపారు. 1న వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం, జిల్లా కార్యాలయాల్లో వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది కానీ తెలంగాణ నుంచి ఏపీ విడిపోలేదని అన్నారు. నవంబర్ 1న అవతరణ వేడుకలు చేసుకోవడమే సమంజసమని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అవతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించడం దురృష్టకరమని అన్నారు.