తాండూరులో సినీ ఫక్కీలో చోరీ..
Published Thu, Sep 19 2013 3:56 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు పట్టణంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. దుండగులు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి యజమానిని మభ్యపెట్టి పట్టపగలే రూ. 4.5 లక్షలు చేసే బంగారాన్ని అపహరించుకుపోయారు. మరో దుకాణంలోనూ చోరీకి యత్నించారు. ఈ ఘటన బుధవారం పట్టణంలో కలకలం సృష్టించింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గాంధీచౌక్ సమీపంలో రామకృష్ణ జ్యువెలర్స్ ఉంది. బుధవారం మధ్యాహ్నం సుమారు 40-45 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు దుకాణానికి వచ్చి హిందీలో మాట్లాడారు. 5 గ్రాముల వెండి బిళ్లను కొనుగోలు చేసి రూ. 260 చెల్లించారు. చిన్నపిల్లలకు సంబంధించిన బంగారు ఉంగరాలను చూశారు.
ఎరుపురంగు రాయి ఉన్న ఓ ఉంగరానికి కొంత పాలిష్ తక్కువ చేయాలన్నారు. దీంతో యజమాని ముదెళ్లి విజయ్‌కుమార్ గుమాస్తా గుండప్పకు ఉంగరం ఇచ్చి పంపాడు. అనంతరం ‘ఓం’ గుర్తు ఉన్న బిళ్లలను చూసి డిజైన్‌లు నచ్చలేదన్నారు. పలు బాక్స్‌ల్లోని బంగారం, వెండి ఆభరణాలు చూస్తామని బయటకు తీయించారు. ఈక్రమంలోనే దుండగులు యజమానితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తమ చోర కళను ప్రదర్శించారు. ఓ బాక్సును చాకచక్యంగా అపహరించారు. తర్వాత లక్ష్మీపూజకు చిన్న బంగారం ముక్క (ముడి బంగారం) కావాలని 115 మిల్లీ గ్రాములు కొనుగోలు చేసి రూ.390 చెల్లించి వెళ్లిపోయారు. దుకాణం యజమానికి అనుమానం వచ్చి ఆభరణాలు ఉన్న బాక్సులను పరిశీలించగా ఒకటి కనిపించలేదు. దుండగులు దాదాపు రూ.4.5 లక్షలు విలువ చేసే 15 తులాల ముడి బంగారంతో పాటు నగలను అపహరించుకుపోయారని గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు.
దుండగుల కోసం పరిసరాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా రామకృష్ణ జ్యువెలర్స్‌లో చోరీకి పాల్పడేకంటే ముందే దొంగలు గాంధీచౌక్‌లోని జీపీ నగల దుకాణం యజమానిని మాటల్లో పెట్టి చోరీకి యత్నించారని, అనుమానం వచ్చిన దుకాణాదారు వారిని బయటకు పంపించేశాడని తెలిసింది. బాధితుడి ఫిర్యాదుతో తాండూరు అర్బన్ సీఐ దుకాణాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. దుండగుల్లో ఓ వ్యక్తి ఎత్తుగా ఎరుపు రంగు, మరో వ్యక్తి లావుగా ఉన్నాడని బాధితుడు తెలిపాడు. దొంగల వద్ద ఓ నల్లబ్యాగు ఉందన్నారు. దుండగులు బైకుపై పరారై ఉండొచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. సీఐ రెండు దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగుల కోసం విస్త్రృ తంగా గాలిస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
Advertisement