డ్రెయినేజీలో దొంగలు పడ్డారు..! | robbers were in dreyineji | Sakshi
Sakshi News home page

డ్రెయినేజీలో దొంగలు పడ్డారు..!

Published Fri, Jul 10 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

డ్రెయినేజీలో  దొంగలు పడ్డారు..!

డ్రెయినేజీలో దొంగలు పడ్డారు..!

యూజీడీ సొమ్ము గోల్‌మాల్
కనెక్షన్ల పేరుతో కలెక్షన్లు
 రూ.6 కోట్లు బొక్కేసిన ఉద్యోగులు
25 వేల కనెక్షన్లు అనధికారికం  
నెలాఖరు లోపు  క్రమబద్ధీకరించుకోకుంటే కట్

 
విజయవాడ సెంట్రల్ : దోపిడీకి కాదేదీ అనర్హం అనుకున్నారో ఏమో.. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) కనెక్షన్ల పేరుతో ఆ విభాగం ఉద్యోగులు రూ.కోట్లు కొల్లగొట్టారు. నగరపాలక సంస్థ ఖజానాకు జమ చేయకుండా తమ జేబులు నింపుకొన్నారు. అనధికారిక యూజీడీ కనెక్షన్లపై ఉన్నతాధికారులు దృష్టిసారించడంలో అక్రమార్కుల గుట్టురట్టయింది. నగరంలో 62,150 యూజీడీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 25 వేల కనెక్షన్లు అనధికారికమేనని ఇంజినీరింగ్ అధికారుల సర్వేలో తేలింది. సర్కిల్-3 పరిధిలోనే సుమారు 22 వేల కనెక్షన్లు అనధికారికంగా ఉన్నట్లు లెక్కతేలింది. ఈ నెలాఖరులోపు క్రమబద్ధీకరణ చేసుకోకుంటే కనెక్షన్లను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడేళ్లుగా దోపిడీ
యూజీడీ కనెక్షన్లకు సంబంధించి సుమారు రూ.6 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. గృహనిర్మాణదారులు,  అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ భవన సముదాయాల నుంచి కొందరు ఉద్యోగులు యూజీడీ కనెక్షన్ల పేరుతో కలెక్ట్ చేసిన సొమ్మును బొక్కేశారు. మూడేళ్లుగా ఈ అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం.  సర్వే సందర్భంగా తాము గతంలో ఫలానా ఉద్యోగులకు సొమ్ము చెల్లించామని పలువురు గృహ యజమానులు వాపోయినట్లు తెలుస్తోంది. యూజీడీ స్కామ్‌పై ఉన్నతాధికారులు దృష్టిసారించడంతో ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు పరారైనట్లు అత్యంత విశ్వసనీయం సమాచారం. మరికొందరు మెల్లగా సర్దుకొనే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఫిర్యాదులు లేకపోవడంతో అక్రమార్కులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

గతంలో చెల్లించినప్పటికీ మళ్లీ యూజీడీ కోసం వేలాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో గృహ యజమానులకు ఆర్థిక భారం తప్పేట్టు లేదు. నిర్ణయించిన టారిఫ్ చార్జీలను బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందిన నాటి నుంచి లేదా మూడేళ్ల నుంచి కానీ వసూలు చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 31 లోపు క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా గడువు విధించారు. లేనిపక్షంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎలాంటి నోటీసూ లేకుండానే కనెక్షన్లు కట్ చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని నగదు చెల్లించే వెసులుబాటు కల్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement