గత కొత కాలంగా దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న అంతర్ జిల్లా దొంగలను కాకినాడ పోలీసులు పట్టుకున్నారు.
కాకినాడ : గత కొత కాలంగా దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న అంతర్ జిల్లా దొంగలను కాకినాడ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివీ...విజయనగరం జిల్లా వేపాడు మండలం దబ్బరాసిపేట గ్రామానికి చెందిన చిమ్మా అప్పారావు పాత నేరస్తుడు. ఇతనిపై విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో పలు కేసులున్నాయి. జైలు శిక్ష కూడా అనుభవించాడు.
ఈ క్రమంలో వివిధ నేరాలపై జైలుకు వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మునసాల చిన్నబాబు, విశాఖ జిల్లాకు చెందిన వంతల కిశోర్‌కుమార్ లతో కలసి ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు బెయిల్ పై బయటకు వచ్చి గత జూలై నెలలో రాజమండ్రిలోని భవానీ జ్యుయెలర్స్‌లో దొంగతనానికి పాల్పడ్డారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 23వ తేదీన మునసాల చినబాబు ఇంటి దగ్గర ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం రూ.12.73 లక్షల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు అమెరికాలో తయారైన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.