► సప్లిమెంటరీ పరీక్షలకు అధిక ఫీజు వసూలు
► రసీదు ఇవ్వని కళాశాలల యాజమాన్యాలు
► ఆందోళనలో విద్యార్థులు
నెల్లూరు (టౌన్): కార్పొరేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు మరో దోపిడీకి సిద్ధమయ్యాయి. కళాశాల తొలిరోజుల్లో ప్రవేశానికి డొనేషన్లతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, మెయింటినెన్స్ తదితర రకాలు పేర్లుతో విద్యార్థుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. తాజాగా సప్లిమెంటరీ ఫీజుల్లోను కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫలితాలు ఈ నెల 13న విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు పలువురు ఇంప్రూవ్‌మెంట్‌కు పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ ఫీజులు చెల్లింపునకు ఆఖరి గడువు కావడంతో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్ష ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. సాధారణంగా ఫరీక్ష ఫీజు, దరఖాస్తు ఫీజుతో కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రూ.600 నుంచి రూ.700 వరకు వసూళ్లు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫీజు చెల్లింపునకు సంబంధించి రసీదులు కూడా ఇవ్వడం లేదు. ఎక్కువ మొత్తం లో తీసుకుని కనీస ఫీజుకు సంబంధించిన రసీదు ఇవ్వకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చాకలివీధిలో ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తోందని ఎస్‌ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడు రవి ఆరోపించారు. పరీక్ష ఫీజుల పేరుతో అధిక మొత్తం వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్‌ఐఓ బాబూజాకబ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన కళాశాలలను విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.