తాళం వేసిన ఇంట్లో చోరీ | Theft in Nellore | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Published Mon, Sep 5 2016 1:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

తాళం వేసిన ఇంట్లో చోరీ - Sakshi

తాళం వేసిన ఇంట్లో చోరీ

 
  •  రూ.14.50 లక్షల సొత్తు అపహరణ
  •  సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ, డీఎస్పీ
  • పాతనేరస్తుల పనిగా అనుమానం
 
నెల్లూరు (క్రైమ్‌) : 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 14.50 లక్షల విలువైన సొత్తును అపహరించుకుని వెళ్లారు. సేకరించిన సమాచారం మేరకు.. కర్నూలుకు చెందిన మాగుంట విశ్వనాథ్‌రెడ్డి వేస్ట్‌పేపర్‌ కొనుగోలు చేసి రాజమండ్రి, హైదరాబాద్‌ల్లోని పేపర్‌ మిల్లులకు సరఫరా చేస్తుంటాడు. కొన్నేళ్ల కిందట వ్యాపారం నిమిత్తం విశ్వనాథ్‌రెడ్డి నెల్లూరు నగరానికి వచ్చారు. బీవీనగర్‌ లెప్రసీ హాస్పిటల్‌ సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. కుమార్తెలు కర్నూలులో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నారు. విశ్వనాథ్‌రెడ్డి తరచూ వ్యాపార నిమిత్తం రాజమండ్రి, హైదరాబాద్‌కు వెళ్లేవాడు. అతను హైదరాబాద్‌కు వెళ్లగా భార్య సునీత కర్నూలులో ఉన్న కుమార్తెల వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు ఇనుప రాడ్లతో ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. పడకగదిలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న రూ. 4.50 లక్షల విలువ చేసే 19 సవర్ల బంగారు ఆభరణాలు, అల్మారాలోని రూ. 10 లక్షల నగదును అపహరించుకుని వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చిన సునీత తలుపులు పగలగొట్టి ఉండటంతో జరిగిన విషయాన్ని భర్తకు తెలియజేసింది. బంధువుల సహకారంతో ఐదో నగర పోలీసులకు చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది. అదనపు ఎస్పీ బి. శరత్‌బాబు, నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, ఐదో నగర ఇన్‌స్పెక్టర్‌ జి. మంగరావు, ఎస్‌ఐ విజయకుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. 
రెక్కీవేసి చోరీ 
దుండగులు రెక్కీవేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దుండగులు ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం తలుపులు పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. బీరువాలో, అల్మారాలో ఉన్న ఆభరణాలను  చోరీ చేశారు. నగలను తీసుకెళ్లే క్రమంలో బంగారు గొలుసు,  ఉంగరం ఇంటి గేటు వద్ద పడిపోయాయి. మిగిలిన ఆభరణాల్లో  కొన్ని గిల్ట్‌ నగలు ఉండటంతో వాటిని ఇంటి బయట ప్రహరీ వద్ద పడవేసి వెళ్లారు. ఇంటి గేటు వద్ద పడి ఉన్న ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. చోరీ జరిగిన తీరు పాతనేరస్తుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదోనగర ఇన్‌స్పెక్టర్‌ జి. మంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement