బంగారం దుకాణంలో చోరీ
గిద్దలూరు : బంగారం దుకాణంలో దొంగలు పడి రూ.6 లక్షల విలువైన ఆభరణాలు అపహ రించిన ఘటన స్థానిక వైశ్యాబ్యాంకు రోడ్డులో ఆదివారం రాత్రి జరిగింది. దుకాణం యజమాని, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీవన్ జ్యుయలరీ దుకాణం యజమాని పీ వెంకటరమణ అందులోనే నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి దుకాణం ముందు ఉన్న ఇనుప గ్రిల్ గేటుకు తాళం వేసి..లోపల ఉన్న షట్టర్‌ను కిందకు దించి తాళం వేయలేదు. గమనించిన దొంగలు గ్రిల్‌కు వేసిన తాళం తొలగించి, దుకాణంలోకి ప్రవేశించి అందులోని ఆరు నక్లెస్‌లు, ఆరు కేజీల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని దుకాణం యజమాని వెంకటరమణ తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పరిశీలించిన ఓఎస్డీ, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులు:
చోరీకి గురైన దుకాణాన్ని మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావ్, సీఐ నిమ్మగడ్డ రామారావు, ఎస్సై ఎం.రాజేష్ పరిశీలించారు. చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గృహంలో ఉండగానే దుకాణంలోని ఆభరణాలు చోరీకి గురవడమేంటని వారు ప్రశ్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ రూబీ కౌంటరు వద్ద దొంగలు వదిలివెళ్లిన సుత్తి, ఇనుప రాడ్లను పరిశీలించి, అక్కడే నివాసం ఉంటున్న యజమాని వద్ద, స్నానం గది, బెడ్ రూం వద్దకు వెళ్లింది. ఆ తర్వాత బయటకు వచ్చిన డాగ్ వీధిలోని రెండు చివరలకు వెళ్లి ఆగి, తిరిగి దుకాణం వద్దకు చేరుకుంది. మరో పర్యాయం గృహంలోకి వెళ్లి మొరిగింది. క్లూస్ టీం సీఐ రాజు, తన సిబ్బందితో కలిసి వేలిముద్రలు, ఆధారాలను సేకరించారు.
చోరీ జరిగిన తీరుపై అనుమానాలు:
జీవన్ జ్యుయలరీ షాపులో దొంగలు పడి ఆభరణాలు చోరీ చేసిన సంఘటనను పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ప్రాంతంలో 15 వరకు నగల దుకాణాలున్నాయి. అవన్నీ వదిలేసి దుకాణంలోనే నివాసం ఉంటున్న చోట దొంగ లు చోరీకి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. విలువైన ఆభరణాలు ఉన్న దుకాణానికి కేవలం గ్రిల్స్‌కు తాళం వేసి న యజమాని,షట్టరుకు తాళం వేయలేదని చెప్పడాన్ని కూడా పోలీసులు సందేహిస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకునే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.