సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : దేశంలో సాంకేతిక అభివృద్ధి కోసం చేస్తున్న రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో నిష్ణాతులుగా ఎదగాలని షార్ సీనియర్ శాస్త్రవేత్త వీఆర్ కట్టి ఇంజనీర్లకు సూచించారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోని వివిధ సెంటర్ల నుంచి ఎంపిక చేసిన 50 మంది ఇంజినీర్లకు షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఆర్ కట్టి మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఇస్రోలో పనిచేసి, తొలి ఉపగ్రహమైన ఆర్యభట్ట నుంచి మూడో తరం ఉపగ్రహాలైన ఇన్‌శాట్-3ఈ వరకూ వివిధ హోదాల్లో పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించానని చెప్పారు. గడిచిన 50 ఏళ్ల అంతరిక్ష యానంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వారికి వివరించారు. మన ఉపగ్రహాలను ఇతర దేశాలకు చెందిన అంతరిక్ష కేంద్రాల నుంచి ప్రయోగించే స్థాయి నుంచి మనమే ప్రయోగించే స్థాయికి ఎదిగామన్నారు. షార్‌లో రెండు ప్రయోగ వేదికలను నిర్మించుకుని వంద ప్రయోగాల మైలు రాళ్లను దాటామని చెప్పారు. సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో క్రయోజనిక్ దశను రూపొందించి ప్రయోగాలు చేసే స్థాయి కి ఎదిగామని చెప్పారు.
ఇస్రో ఇక నుంచి భవిష్యత్ అంతా భారీ ప్రయోగాల మీదే దృష్టి సారించిందని, దీనికి మీ వంతుగా మంచి ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా భావితరాల వారికి అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు. కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పీ విజయసారథి మాట్లాడుతూ ఈ బృహత్ కార్యనిర్వహణ సిద్ధాంత పరంగా 1950లోనే ప్రపచంలోని అన్ని దేశాల్లో ప్రారంభమైనప్పటికి 113 (ఏడీ) సంవత్సరంలోనే దీన్ని తెలియకుండా ఆచరిస్తున్నారని వివరించారు. 37 ఏళ్లు నాసాలో పని చేసిన జెర్రి మబ్డీన్, హెన్రీగాన్ట్ (1861-1919) మధ్యలో వీరు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలను మనం స్మరిస్తూ ఆచరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షార్‌లోని అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు
రాకెట్ ప్రయోగాల్లో నిష్ణాతులుగా ఎదగండి
Published Tue, Aug 27 2013 6:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement