నేటి నుంచి రొట్టెల పండగ | Roti Festival In PSR Nellore | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రొట్టెల పండగ

Published Fri, Sep 21 2018 1:25 PM | Last Updated on Fri, Sep 21 2018 1:25 PM

Roti Festival In PSR Nellore - Sakshi

రొట్టెలు మార్చుకుంటున్న భక్తులు

కోరికలు తీర్చే వరాల పండగ వచ్చేసింది. నమ్మకాలకు, మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే రొట్టెల పండగకు  నెల్లూరు నగరం ముస్తాబైంది. బారాషహీద్‌ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలు  సర్వాంగ సుందరంగా మారాయి. నమ్మకంతో కోర్కెలు కోరుకుని రొట్టెలు పట్టుకోవడం.. అవి తీరడంతో ఏడాది తర్వాత రొట్టెలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. 1751 సంవత్సరం నుంచి ఏటా జరిగే రొట్టెల పండగ విశిష్టత సరిహద్దులు చేరిపేసింది. జిల్లాలు, రాష్ట్రాలు దాటి విదేశాల నుంచి భక్తుల రాకకు వేదికగా మారింది. శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమై 25వ తేదీ వరకూ జరిగే కార్యక్రమాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): రొట్టెల పండగ సందర్భంగా రెండువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదురోజులపాటు ప్రతిష్టాత్మకంగా జరిగే పండగకు పలు వివిధ దేశాలు, రాష్టాల నుంచి భక్తులు రానున్నారు. ఈ నేథ్యంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, జిల్లా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. బుధవారమే గుంటూరు రూరల్, అర్బన్, ప్రకాశం జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది నగరానికి చేరుకున్నారు. ముగ్గురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 41 మంది సీఐలు, 112 మంది ఎస్సైలు, 275 మంది ఏఎస్సైలు, 90 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 100 మంది మహిళా కానిస్టేబుళ్లు, 399 మంది హోంగార్డులు, 52 మంది మహిళా హోంగార్డులు, 100 మంది ఏఆర్‌ సిబ్బంది, కృష్ణపట్నం పోర్టుకు చెందిన సెక్యూరిటీ సిబ్బంది, 200 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎఫ్‌ఎస్, సేవాదళ్‌ బృందాలు, అగ్నిమాక సిబ్బంది బందోబస్తులో ఉంటారు.

కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం
రొట్టెల పండగ జరిగే బారాషహీద్‌ దర్గా, స్వర్ణాల చెరువు, పరిసర ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని కమాండ్‌ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేశారు. అంతేకాకుండా అత్యాధునిక డ్రోన్‌ కెమరాలను వినియోగించి నిత్యం బందోబస్తును పర్యవేక్షించనున్నారు. 

ప్రభుత్వ అధికారులకు..
విధులకు హాజరయ్యే ప్రభుత్వ అధికారుల వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. వీఐపీ, పోలీసు వాహనాలను పొదలకూరురోడ్డులో ఉన్న సాల్వేషన్‌ ఆర్మీ చర్చి, నర్సింగ్‌ కళాశాల ప్రాంతం, పోలీసు వసతి గృహం, డీకేడబ్ల్యూ కళాశాలలో, పోలీసు కవాతు మైదాన ప్రాంతాల్లో పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. మిగిలిన శాఖల అధికారుల వాహనాలను పాత టీబీ ఆస్పత్రి ఆవరణ, నగరపాలకసంస్థ ఆవరణ, జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణాల్లో పార్కింగ్‌ చేయాలి. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను కొత్త పోలీసు కార్యాలయం, కస్తూరిదేవి స్కూల్‌ మైదానం, ఉర్దూ మదరాసా స్కూల్‌ ప్రాంతం, కస్తూరిదేవి స్కూల్‌ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం, సర్వోదయ కళాశాల మైదాన ప్రాంగణం, పాత సీవీ రామన్‌ స్కూల్, మాగుంటలేఅవుట్‌లోని రైల్వే స్థలం రోడ్డు, పిచ్చిరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా, శబరి రామక్షేత్రం రోడ్డు, ఎస్సీ హాస్టల్, ఏసీ సుబ్బారెడ్డి మైదానం, ప్రభుత్వాస్పత్రి ప్రాంగణాల్లో పార్కింగ్‌ చేయొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ పార్కింగ్‌ స్థలాల గురించి నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది సూచనలిస్తారు.

అందుబాటులో గజ ఈతగాళ్లు
రొట్టెలు పట్టుకునే స్వర్ణాల చెరువులో ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు, ఫైర్‌ సిబ్బంది 30 మంది గజ  ఈతగాళ్లను నియమించారు. వీరు మూడు షిప్టుల్లో  నిరంతరం చెరువు వద్ద పహారా కాస్తారు. 

పోలీసు కంట్రోల్‌ రూం ఏర్పాటు
దర్గా వద్ద పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. పండగ కోలాహలంలో ఎవరైనా తప్పిపోయినా, కనిపించకపోయినా కంట్రోల్‌ రూంకు వచ్చి ఆనవాళ్లతో సమాచారం అందజేయొచ్చు.  
మఫ్టీలో సీసీఎస్‌ సిబ్బందిచైన్‌ స్నాచింగ్, పిక్‌పాకెట్, దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున సీసీఎస్‌ సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ బందోబస్తు చేస్తారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న, అనుభవం ఉన్న వారిని ఏర్పాటు చేశారు. 

బస్సులు, భారీ వాహనాల మళ్లింపు
పండగ నేపథ్యంలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా వాహనాల మళ్లిస్తారు. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయటం జరిగింది. తిరుపతి వైపు నుంచి వచ్చే వాహనాలను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద, కావలి వైపు నుంచి వచ్చే వాహనాలను సర్వోదయ కళాశాల మైదానంలో, ఆత్మకూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ఇరుగాళమ్మ దేవస్థానం, బట్వాడిపాలెం వద్ద, గొలగమూడి, అనికేపల్లి వైపు వచ్చే వాహనాలను మాగుంటలేఅవుట్‌ వద్ద ఉన్న పిచ్చిరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement