ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు
సాక్షి, తిరుమల: వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. దానికి తక్షణమే రూ. 20 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు సోమవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు.
మరికొన్ని నిర్ణయాలు..
► వైఎస్సార్ కడప జిల్లాలోని దేవుని కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల వసతి సముదాయం నిర్మాణం కోసం రూ. 5 కోట్లు కేటాయించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద తుమ్మూరులోని కరియమాణిక్యస్వామి, శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు. తిరుమలలోని రాఘవేంద్రస్వామి మఠానికి అదనపు స్థలం కేటాయించారు. స్విమ్స్ ఆస్పత్రిలో మాలిక్యులర్ బయాలజీ పరిశోధనశాల ఏర్పాటుకు రూ. 6.03 కోట్లు, డయాలసిస్ భవనంలో అదనపు గదుల నిర్మాణానికి రూ. 3.68 కోట్లతో చేపట్టిన టెండర్ పనులకు ఆమోదం తెలిపారు.
► రూ. 3.92 కోట్లతో తిరుపతిలోని కోదండ రామస్వామి సత్రం, రూ. 3.67 కోట్లతో గోవింద రాజస్వామి సత్రం అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ. 1.25 కోట్లతో విజయనగరం జిల్లా కొత్త వలసలో కల్యాణ మండపం నిర్మాణానికి అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లా కందుకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 25 లక్షలు కేటాయించారు.
► రూ. 1.06 కోట్లతో తిరుమల శ్రీవారి ఆలయానికి 1,150 పట్టువస్త్రాలు కొనుగోలు చేయనున్నారు.
► శ్రీవారి సేవా వ్యవస్థను బలోపేతం చేసేందుకు శ్రీవారి సేవా సెల్‌ను ఏర్పాటు చేశారు.
► టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 12,200, కాంట్రాక్టు కార్మికులకు రూ. 6,100 బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో వరద బాధితులకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు టీటీడీ ఆరు బృందాలను పంపింది. మంగళవారం నుంచి టీటీడీ వైద్యులు తమ సేవలందించి, ఉచితంగా మందులు సరఫరా చేస్తారని చైర్మన్, ఈవో ప్రకటించారు. కాగా విచక్షణ కోటా కింద కేటాయించే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ధరలతో పాటు కల్యాణ మండపాలు, తిరుమలలోని గదుల అద్దెలు పెంచాలని టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ నిర్ణయించింది. మరోవైపు తిరుమలలో సోమవారం ఆరని తాజా లడ్డూలు పంపిణీకి సిద్ధం చేశారు. భక్తుల చేతికి అందకుండానే పొడిగా మారడంతో వాటి పంపిణీ ఆపేశారు.