188 కోట్లతో తిరుపతి అభివృద్ధి
- టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం
- విద్య, వైద్య, వసతులకు పెద్దపీట
సాక్షి, తిరుమల: తిరుపతి అభివృద్ధి కోసం రూ.188 కోట్లు కేటాయిస్తూ మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో తిరుపతిలోని అభివృద్ధి పనులన్నింటికీ ఆ మొత్తంలో నిధులు కేటాయించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మీడియాకు తెలిపారు. తిరుపతి లో టీటీడీ సత్రాల అభివృద్ధి, కాలేజీలు, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల భవంతులు, 14 మార్గాల్లో రోడ్ల అభివృద్ధి, అధునాతన ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, చెరువుల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.
సమావేశంలో తీర్మానాలివి..
► రూ.78.28 కోట్లతో కిలో రూ.364 చొప్పున 21.50 లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలు
► నవంబర్ 14న ఏపీ, తెలంగాణల్లో ఎనిమిదో విడత ‘మనగుడి’ కార్యక్రమం నిర్వహణకు రూ.63.93 లక్షల మంజూరు. నెలాఖరున శంషాబాద్‌లో శ్రీనివాసకల్యాణం నిర్వహణ
► రూ. 5.2 కోట్లతో తిరుచానూరులో నిత్యాన్నప్రసాద భవన నిర్మాణం
► రూ. 5.6 లక్షలతో చంద్రప్రభ వాహనం తయారీ, అమ్మవారి ఆలయంలో బంగారుపూత పనులకు రూ.2.67 లక్షల మంజూరు
► టీటీడీలోని కాంట్రాక్టు కార్మికుల వేతనం రూ.6,700 నుంచి రూ. 13 వేలకు పెంపు.
► టీటీడీ ఉద్యోగులకు రూ.12,500 బ్రహ్మోత్సవ బహుమానం, కాంట్రాక్టు కార్మికులకు రూ.6,250 మంజూరు హా రూ. 1.6 కోట్లతో అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండపంలోని గుప్తకామేశ్వరి, ఇతర ఆలయాల అభివృద్ధి
► వైఎస్సార్ కడపజిల్లా మైదుకూరులోని భీమేశ్వరి స్వామి ఆలయం అభివృద్ధికి రూ.22.50 లక్షలు, ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షల మంజూరు హా విజయనగరంలో నేత్ర వైద్యశాల నిర్మాణానికి పుష్పగిరి నేత్ర సంస్థకు 25 సంవత్సరాలకు కౌలుకు టీటీడీ స్థలం కేటాయింపు. హా రూ. 14.50 కోట్లతో తిరుపతిలో నిర్మించనున్న ఎస్‌వీబీసీ స్టూడి యో నిర్మాణం టెండర్ పనులకు ఆమోదం.
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడికి నోటీసు
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన డాక్టర్ ఏవీ రమణ దీక్షితులకు సోమవారం టీటీడీ నోటీసు జారీ చేసింది. అక్టోబర్‌లో జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన తన మనవడితో కలసి గర్భాలయ ప్రవేశం చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు కూడా ఆలయ అధికారులు చూశారు. ఇందులో భాగంగా ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామారావు సోమవారం ఆయనకు నోటీసు జారీ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.