2015-16లో సత్యదేవునికి
రూ.118.95 కోట్ల ఆదాయం
గత ఏడాదికంటే రూ.26 కోట్లు అధికం
వ్రతాల ద్వారా ఎక్కువ రాబడి
ప్రసాదం, హుండీలది తరువాతి స్థానం
అన్నవరం : రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని సన్నిధి లక్ష్మీకటాక్షంతో అలరారుతోంది. స్వామివారి ఆదాయం ఏటేటా పెరగడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. తొలిసారిగా సత్యదేవుని ఆదాయం రూ.వంద కోట్ల మార్కును దాటి.. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.118.95 కోట్లుగా నమోదైంది. పదేళ్ల కిందటి వరకూ వార్షికాదాయం రూ.25 కోట్లు మాత్రమే ఉండగా.. చూస్తూండగానే రూ.వంద కోట్ల మైలురాయిని అధిగమించింది.
రూ.26 కోట్ల పెరుగుదలతో 28 శాతం వృద్ధి
అన్నవరం దేవస్థానానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో కె.నాగేశ్వరరావు మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. దీని ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరంలో స్వామివారికి రూ.118.95 కోట్ల ఆదాయం వచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ.92.92 కోట్లతో పోల్చితే.. ఈ ఏడాది రూ.26 కోట్ల పెరుగుదలతో 28 శాతం వృద్ధి నమోదైందని ఈఓ తెలిపారు. 2013-14లో రూ.72 కోట్లు మాత్రమే ఉన్న ఆదాయం.. 2015-16 నాటికి సుమారు 60 శాతం పెరుగుదలతో రూ.118.95 కోట్లకు చేరింది. 2016-17లో రూ.135 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుత వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.140 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నారు.
ఆపరేషనల్ ఆదాయం రూ.82.55 కోట్లు
దేవస్థానంలోని వివిధ షాపుల లీజులు, తలనీలాల విక్రయం, టోల్‌గేట్ వసూళ్లు, సత్రాల అద్దెలు, హుండీల ఆదాయం, ప్రసాదాల విక్రయం, వ్రతాలు, అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలు, కేశఖండన ద్వారా ఆదాయం, ట్రాన్స్‌పోర్టు, డిపాజిట్ల మీద వడ్డీలు తదితర పద్దుల ద్వారా దేవస్థానానికి రూ.82.55 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిని ఆపరేషనల్ ఆదాయంగా పేర్కొంటున్నారు.
కేపిటల్ ఆదాయం రూ.36.40 కోట్లు
కేపిటల్ ఆదాయంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూ సమీకరణ ద్వారా ఆదాయం, ఇతర డిపాజిట్లు, వివిధ స్కీముల కింద విరాళాలు తదితర పద్దుల కింద వచ్చిన మొత్తం రూ.36.40 కోట్లుగా పేర్కొన్నారు.
తగ్గుతున్న వ్రతాల ఆదాయం
సత్యదేవుని ఆలయంలో ప్రధాన క్రతువు అయిన వ్రతాల ద్వారా వస్తున్న ఆదాయం తగ్గుతోంది. వ్రతపురోహితుల వ్యవహారశైలి మీద తరచూ వస్తున్న విమర్శల ప్రభావమో లేక ఇతర కారణమో తెలియదు కానీ వ్రతాల ఆదాయం మాత్రం ఆశించినంతగా రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. 2014-15లో వ్రతాల ఆదాయం రూ.19.19 కోట్లు రాగా, 2015-16లో ఆదాయం రూ.21.75 కోట్లు వచ్చింది. వాస్తవానికి రూ.2.50 కోట్లు పెరుగుదల కనిపిస్తున్నా 2015 జనవరి నుంచి వ్రతాల టిక్కెట్లు 33 శాతం పెరిగాయి. ఇందువల్లనే ఈ పెరుగుదల నమోదైంది తప్ప వ్రతాలు పెరగడంవల్ల కాదు. దీనిపై అధికారులు పరిశీలన చేయాల్సి ఉంది.
అంతరాలయం టిక్కెట్లతో కనకవర్షం
సత్యదేవుని అంతరాలయంలోకి వెళ్లేందుకు స్పెషల్ దర్శనం పేరుతో విక్రయిస్తున్న రూ.100 టిక్కెట్లు దేవస్థానానికి కనకవర్షం కురిపిస్తున్నాయి.
2014-15లో ఈ టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2.95 కోట్లు రాగా 2015-16లో అది రూ.5.02 కోట్లకు పెరిగింది.
ఆశించినట్టుగానేఆదాయం
2015-16లో ఆశించినట్టుగానే దేవస్థానానికి ఆదాయం సమకూరింది. వ్రతాల ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నించాల్సి ఉంది. 2016-17లో రూ.135 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాం. దీనిని రాబట్టేందుకు సిబ్బంది, పురోహితులు సమష్టిగా కృషి చేయాలి. భక్తులతో అందరూ స్నేహభావంతో మెలగాలి. వారికి ఏ ఇబ్బందీ కలగకుండా సేవలందించాలి.
- కె.నాగేశ్వరరావు, ఈవో, అన్నవరం దేవస్థానం
రత్నగిరివాసునికి ‘లక్ష్మీ’కటాక్షం
Published Wed, Apr 6 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement