మట్టిలో రూ.150.93 కోట్లు మింగేశారు | Rs 150.93 crores scam in the Polavaram Head Works | Sakshi
Sakshi News home page

మట్టిలో రూ.150.93 కోట్లు మింగేశారు

Published Sat, Mar 24 2018 5:05 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Rs 150.93 crores scam in the Polavaram Head Works - Sakshi

సాక్షి, అమరావతి: తివిరి ఇసుక నుంచి తైలం తీయవచ్చునో లేదో గానీ మట్టిలో వందల కోట్లు కొట్టేయడం సాధ్యమేనని ‘ముఖ్య’నేత నిరూపించారు. 1.63 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పైగా చేయని మట్టి పనులను చేసినట్లు చూపి రూ.150.93 కోట్లకు పైగా తినేశారు. మరోవైపు చేయాల్సిన మట్టి పనుల పరిమాణాన్ని అవసరం లేకున్నా 66.59 లక్షల క్యూబిక్‌ మీటర్లు పెంచేసి.. రూ.61.66 కోట్లకుపైగా కాజేయడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు జలాశయం(హెడ్‌ వర్క్స్‌)ను ఈ అక్రమాలకు వేదికగా మార్చుకున్నారు. మట్టిలో వందల కోట్ల రూపాయలు ఏరుకుంటున్న ‘ఏలుతున్న’వారి అక్రమాల బాగోతం ఇదిగో..! 

మట్టి పనుల పరిమాణాన్ని పెంచేసి...
జలాశయంలో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, పవర్‌ హౌస్‌ పునాది తవ్వకంతో కలిపి మొత్తం 10.49 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్నాక జలాశయం పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఈ క్రమంలోనే మట్టి తవ్వకం పనులను త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టు కింద కట్టబెట్టారు. ఇదే సమయంలో అవసరం లేకున్నా మట్టి పనుల పరిమాణాన్ని పెంచేసి.. పెంచిన పనులను చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు నొక్కేసేలా ఆదిలోనే త్రివేణి సంస్థతో ముఖ్యనేత రహస్య అవగాహనకు వచ్చారు. అందులో భాగంగానే 2016 అక్టోబర్‌ 17 నాటికి మట్టి పనుల పరిమాణాన్ని 6 లక్షల క్యూబిక్‌ మీటర్లు పెంచేసి 10.55 కోట్ల క్యూబిక్‌ మీటర్లుగా అధికారుల చేత ఖరారు చేయించారు. పనులు మరింత పెంచాలంటూ ముఖ్యనేత ఒత్తిడి చేయడంతో గత ఫిబ్రవరి 5న 16 లక్షల క్యూబిక్‌ మీటర్లు, ఫిబ్రవరి 19న మరో 44.59 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర అధికారులు పెంచేశారు. దాంతో మట్టి పనుల పరిమాణం 11,15,59,000 క్యూబిక్‌ మీటర్లకు చేరుకుంది. అంటే.. అవసరం లేకున్నా 66.59 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి పనులను పెంచేసి.. వాటిని చేయకుండానే చేసినట్లు చూపి రూ.61.66 కోట్లను కాజేయడానికి ముఖ్యనేత పక్కాగా ప్రణాళిక వేసినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ‘సాక్షి’ వద్ద ఉన్నాయి. 2015–16 ధరల ప్రకారం క్యూబిక్‌ మీటర్‌ మట్టి పనికి రూ.92.60 చెల్లిస్తారు. హార్డ్‌రాక్‌(బండరాళ్లు)తో కూడిన మట్టిని తవ్వే పనులకు అదనంగా బిల్లులు చెల్లిస్తారు.

చేయని పనులు చేసినట్లు చూపి...
ప్రతి సోమవారం విజయవాడ నుంచి పోలవరం జలాశయం పనులపై వర్చువల్‌ రివ్యూ నిర్వహించే సీఎం చంద్రబాబు.. మూడు వారాలకు ఒకసారి ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో 2017 అక్టోబర్‌ 3న 20వ సారి పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ రోజు నాటికి 7.59 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయని, మరో 2.96 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలాయని అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ ఆ రోజు నాటికి వాస్తవంగా 5.96 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మాత్రమే చేశారు. ముఖ్యనేత ఒత్తిడి మేరకు 1.63 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయకున్నా చేసినట్లు చూపి రూ.150.93 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత ఆ డబ్బులను ముఖ్యనేత తన జేబులో వేసుకున్నారు. అంతటితో ఊరుకోలేదు. అవసరం లేకున్నా పెంచేసిన మట్టి పనులను చేసినట్లు చూపి.. బిల్లులు చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.


కేంద్రం నిఘాతో సర్దుబాటు యత్నాలు..
మరోవైపు పోలవరం జలాశయంలో అంతర్భాగమైన స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో రూ.1483.22 కోట్ల విలువైన పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించి కమీషన్లు రాబట్టుకోవడానికి గత నవంబర్‌ 16న రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తమ అనుమతి లేకుండా దీన్ని జారీ చేశారని.. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అదే రోజున కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అక్రమంగా జారీ చేసిన టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ గత నవంబర్‌ 27న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కలకలం రేపింది. పోలవరం పనులపై పీపీఏ, కేంద్ర ప్రభుత్వం నిఘాను పెంచాయి. చేయని పనులకు రూ.150.93 కోట్ల మేర బిల్లులు కాజేసిన అక్రమాల బాగోతం బయటపడితే ఇబ్బందులు తప్పవని భావించిన ముఖ్యనేత.. ఆ మేరకు పనులను సర్దుబాటు చేయాలంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. రోజుకు రూ.లక్ష నుంచి 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి పనులు చేసే సామర్థ్యం త్రివేణికి ఉంది. గత అక్టోబర్‌ నుంచి వర్షాలు లేవు. మట్టి పనులు భారీ ఎత్తున చేస్తున్నా.. ఈ పనులనే గతంలో చేసినట్లు చూపుతూ రికార్డులను తారుమారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గత ఏడాది నవంబర్‌ నుంచి ఈనెల 12 వరకూ సుమారు 95 లక్షల క్యూబిక్‌ మట్టి పనులను గతంలోనే చేసినట్లు చూపి రికార్డులు సర్దుబాటు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తమ్మీద ఈనెల 12 నాటికి 7.78 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తి చేసినట్లు చూపారు. అంటే ఐదు నెలల్లో కేవలం 19 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మాత్రమే చేసినట్లు చూపడం గమనార్హం. ఈనెల 12 వరకు జలాశయం మట్టి పనులకు సుమారు రూ.900.01 కోట్ల మేర అధికారులు బిల్లులు చెల్లించారు. వీటిని పరిశీలిస్తే ఇప్పటికీ 68 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనిని సర్దుబాటు చేయాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అధికార వర్గాల్లో కలకలం...
కేంద్రం నిఘాను పెంచడంతో పోలవరం జలాశయం పనులను పర్యవేక్షిస్తున్న అధికార వర్గాల్లో కలకలం రేగుతోంది. పనుల పరిమాణం పెంచేయడం బహిర్గతమైతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు కేంద్రం ఆడిటింగ్‌ నిర్వహిస్తే చేయని పనులకు బిల్లులు చెల్లించిన అక్రమాల బాగోతం బయటపడుతుందని భయపడుతున్నారు. ఈ అక్రమాలపై ఏ అధికారిని కదిపినా నోరుమెదపడం లేదు. ఇదే అంశంపై ఓ కీలక అధికారిని ‘సాక్షి’ వివరణ కోరగా... చేయని పనులకు బిల్లులు చెల్లించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కేంద్రం నిఘాను పెంచడంతో గత ఐదు నెలలుగా చేస్తున్న పనులను గతంలోనే చేసినట్లు చూపామని అంగీకరించారు. ఇంకా రూ.60 నుంచి రూ.65 కోట్ల విలువైన పనులను సర్దుబాటు చేయాల్సి ఉందని చెప్పారు. తన పేరు బయటపెట్టవద్దంటూ ‘సాక్షి’ని ఆ అధికారి ప్రత్యేకంగా కోరడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement