
సాక్షి, అమరావతి: గృహ విద్యుత్తు వినియోగదారులకు రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వం రూ.1,707 కోట్ల మేర సబ్సిడీలను అందచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఆక్వా, నర్సరీలు, దోబీఘాట్‌లు, సెలూన్లు, స్వర్ణకారులతోపాటు ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నారు.
మరోవైపు ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు సకాలంలో చెల్లిస్తోంది. గత సర్కారు డిస్కమ్‌లకు అతి కష్టం మీద ఏటా రూ. 4 వేల కోట్లు సబ్సిడీగా ఇస్తుండగా ఇప్పుడది రూ.11,311.65 కోట్లకు చేరింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీనే రూ. 8,354 కోట్లు ఉంది. డిస్కమ్‌ల అప్పులు తీర్చే మార్గాలను అన్వేషించడంతో పాటు సబ్సిడీలను ఎప్పటికప్పుడు ఇవ్వడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. బడ్జెట్‌లోనూ ఈ సబ్సిడీలను పొందుపరుస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.