రూ.19 కోట్లతో వసతి గృహాల అభివృద్ధి
Published Fri, Jan 10 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
బొండపల్లి, న్యూస్‌లైన్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలను 19.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆ శాఖ డెరైక్టర్ కె. ఆదిత్యలక్ష్మి తెలిపారు. గురువారం బొండపల్లి గ్రామానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ, బొబ్బిలిలోని బాలుర వసతి గృహం, విజయనగరంలోని రెండు బాలికల వసతిగృహాలు, బాలుర వసతి గృహాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఏడున్నర కోట్ల రూపాయలతో ఎనిమిది కమ్యూనిటీ హాస్టల్స్‌కు భవనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే గజపతినగరం మండలం లోగిశలో మూడు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మించినట్లు చెప్పారు. జిల్లాలోని 29 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చదువుతున్న 448 మంది పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక మెటీరియల్ పంపిణీ చేశామన్నారు. గతేడాది 89.5 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ ఏడాది శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూఓ రత్నం పాల్గొన్నారు.
Advertisement
Advertisement