రూ. 25లక్షల విలువైన విత్తనాలు సీజ్ | Rs. 25 lakh worth of seeds seized | Sakshi
Sakshi News home page

రూ. 25లక్షల విలువైన విత్తనాలు సీజ్

Published Sun, Jun 22 2014 12:31 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

Rs. 25 lakh worth of seeds seized

ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నరసరావుపేట టౌన్: నరసరావుపేట పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. స్టేషన్‌రోడ్డులోని వెంకటేశ్వర సీడ్స్ దుకాణంలో విజిలెన్స్ సీఐ వంశీధర్, డీఈ సుందరబాబు, హెడ్‌కానిస్టేబుల్ రాంబాబులు తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాలకు రూ.35 లక్షల మేర సీడ్స్ విక్రయించినట్లు నిర్థారించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

ఎరువులు, విత్తనాలు దుకాణాల్లో నిల్వలు, ఇతర జిల్లాలకు విక్రయాలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలతో పాటు విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారనేది ఆరా తీస్తున్నామని చెప్పారు. వెంకటేశ్వర సీడ్స్‌దుకాణంలో అక్రమంగా ఇతర జిల్లాలకు సీడ్స్ ఎగుమతి చేసినట్లు రికార్డుల ప్రకారం తేలడంతో ఆ షాపు యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు  దుకాణంలో క్రయవిక్రయాలు నిలుపుదల చేయాలని ఆదేశించామన్నారు. షాపులో ఉన్న విత్తనాలకు, రిజిస్టర్‌లో పొందుపరిచిన లెక్కలకు వ్యత్యాసం ఉండడంతో అక్కడున్న రూ. 25లక్షల పైచిలుకు విలువగల విత్తనాలను సీజ్ చేశామన్నారు.  
 
రూ.5 లక్షల విలువైన పత్తి విత్తనాలు సీజ్..

మాడుగుల (గుర జాల): విజిలెన్స్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాలమేరకు మాడుగుల గ్రామంలో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. మండలంలోని మాడుగుల గ్రామంలో పురుగు మందులు విక్రయిస్తున్న వెంకటలక్ష్మీ ట్రేడర్స్, లక్ష్మీ ట్రేడర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా ఈ షాపుల్లో పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు షాపుల్లో రూ. 5 లక్షల విలువైన 540 ప్యాకెట్ల పత్తి విత్తనాలను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా విజిలెన్స్ ఏవో వెంకట్రావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనే సమయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు సూచించారు. గ్రామంలో విజిలెన్సు అధికారుల రాకను పసిగట్టిన  యజమానులు తమ షాపులను మూసివేశారు.

గురజాల మండల వ్యవసాయాధికారి అంజిరెడ్డికి మూసివేసిన షాపులను అదివారం, సోమవారం విచారించాల్సిందిగా సూచించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్‌ఐ షేక్ కాశీంసాహెబ్, విజిలెన్స్ ఫారెస్టు అధికారి శ్రీరాములు, గురజాల వ్యవసాయాధికారి బి.అంజిరెడ్డి, గ్రామరెవెన్యూ అధికారి పద్మ, విజిలెన్స్ కానిస్టేబుళ్లు రమేష్, నాగరాజు పాల్గొన్నారు.
 
300 బస్తాల వరి విత్తనాలు స్వాధీనం
రెంటాల (రెంటచింతల): రెంటాల గ్రామంలోని ఓ నివాసంలో అక్రమంగా నిల్వచే సిన 300 బస్తాల వరి విత్తనాలను శనివారం రాత్రి మండల వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు.  గ్రామానికి చెందిన పూజల చిన్ననాగేశ్వరావు నివాసంలో లెసైన్స్ లేకుండా నంద్యాలకు చెందిన నీలకంటేశ్వర సీడ్స్ కంపెనీ బీపీటీ వరి విత్తనాల బస్తాలను నిల్వ చేసి బిల్లు లేకుండా విక్రయిస్తున్నాడు.

గ్రామస్తుల సమాచారం మేరకు జేడీఏ వి.శ్రీధర్ ఆదేశాల మేరకు  ఏవో నరసింహారావు, ఏఈవో తారాసింగ్‌లు దాడిచేసి విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందన్నారు. విత్తన బస్తాలను రెంటచింతల మార్కెట్ యార్డ్‌కు తరలిస్తున్నట్లు ఏవో తెలిపారు. దాడిలో ఇన్‌చార్జి ఆర్‌ఐ కటికల బాలయ్య, మార్కెట్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement