
రాజధానికి 3 లక్షల కోట్లు కావాలి!
కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా
14వ ఆర్థికసంఘాన్ని కోరనున్న ఏపీ
రేపు తిరుపతికి ఆర్థికసంఘం రాక...
ఎల్లుండి సీఎం, అధికారులతో భేటీ
హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్రం నుంచి గ్రాంటుకు సిఫారసు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు 14వ ఆర్థికసంఘాన్ని కోరాలని నిర్ణయించారు. దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత అధికారులు రాజధాని నిర్మాణానికి 1.35 లక్షల కోట్ల రూపాయల గ్రాంటును కోరేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేశారు. దీనిపై సీఎం స్పంది స్తూ రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీయే 4.50 లక్షల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించి ప్రతిపాదనలను మార్చాలని సూచించారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనలను సవరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేశామని, రాష్ట్రం విడిపోయినందున రెవెన్యూ మిగులు నుంచి లోటులోకి వెళ్లిపోయామని, ఈ నేపథ్యంలో ద్రవ్య లోటును 7 శాతానికి, రెవెన్యూ లోటును 4.8 శాతానికి పెంచుతూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో సవరణలకు సిఫారసు చేయాలని కోరనున్నారు. 14వ ఆర్థికసంఘం చైర్మన్ వై.వి.రెడ్డి, ఇతర సభ్యులు ఈ నెల 11వ తేదీన తిరుపతికి చేరుకోనున్నారు. 12న తిరుపతిలోనే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, సీఎస్, పలు శాఖల ఉన్నతాధికారులతో ఆర్థికసంఘం సమావేశమవుతుంది.ట