
రూ.37 లక్షల నగలు స్వాధీనం
తిరుపతి నగరంలో తెల్లవారుజామున మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళుతున్న ముగ్గురు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
=గొలుసు దొంగల అరెస్ట్
=రెండు బైక్‌లు స్వాధీనం
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుపతి నగరంలో తెల్లవారుజామున మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళుతున్న ముగ్గురు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.37 లక్షల విలువ చేసే 1.25 కిలోల బంగారు నగలను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గురువారం అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు మీడియాకు తెలిపారు.
అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన రాసంపల్లి మంగళ శ్రీనివాసులు అలియాస్ శీను అలియాస్ వాసు(32) తిరుపతి నగరం లో పలు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇతను తెల్లవారుజామున ఇళ్లముందు ముగ్గులు వేస్తున్న మహిళలను, మంచినీటి బోర్ల దగ్గర ఒంటరిగా ఉన్నవారిని ఎంచుకునేవాడు. వారి వద్దకు వచ్చి తాను ఎల్‌ఐసీ ఏజెంటునని ఫలానా పేరు కలిగిన వ్యక్తి చిరునామా కావాలంటూ మాటల్లో పెట్టి మెడల్లోని బంగారు గొలుసులను తెంచుకుని బైక్‌లో పరారయ్యేవాడు.
అప్పటికే అతను వైఎస్‌ఆర్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దాదాపు 60 నేరాలకు పాల్పడి 5 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యాడు. తిరుపతి నగరంలో 29 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ నగలను పెనుగొండ, ధర్మవరం బ్యాంకులలో కుదవపెట్టి విలాసవంతమైన జీవితం గడుపుతుండేవాడు. తిరుపతి క్రైం డీఎస్పీ ఎంవీఎస్.స్వామి, సీఐలు రంగనాయకులు, గిరిధర్, నాగసుబ్బన్న, ఎస్‌ఐలు ప్రభాకరరెడ్డి, చంద్రశేఖర్‌పిళ్లై, పోలీస్ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు.
నగలన్నింటినీ రికవరీ చేశారు. అలాగే తిరుపతి టౌన్ రాజీవ్‌నగర్‌గాంధీ కాలనీకి చెందిన బి.వెంకటరమణ(23), రాంప్రసాద్(21)ను బుధవారం ఆదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 కేసులకు సంబంధించి 14 బంగారు చైన్లను, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో బైక్‌లో వెళ్లి ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంచుకుని వెళ్లేవారు. అలాగే తిరుమలలో పార్వేటి మండపం వద్ద పాత నేరస్తుడు కుంచం మారయ్య(25)ను గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 చోరీలకు సంబంధించిన కేసుల్లో సొత్తును రికవరీ చేశారు. నిందితుడు గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన వాడిగా గుర్తించారు.
ప్రజలు సహకరించాలి
దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరిగినపుడు ప్రజలు సహకరిస్తే నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునే అవకాశం వుందని ఎస్పీ తెలిపారు. బైక్ నెంబరుగానీ, నిందితుడి ముఖ కవళికలను గానీ తెలియజేయాల న్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసులకు ఆయన క్యాష్ రివార్డులు అందజేశారు.