రూ.4 కోట్లకు ఎల్‌ఐసీ ఉద్యోగి కుచ్చుటోపీ
- వందమంది వర కూ బాధితులు
- సెలవులో వెళ్లి వచ్చిన ఉద్యోగిని పట్టుకున్న బాధితులు
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తూ తన కార్యాలయానికి వచ్చే ఏజెంట్లతో పాటు పట్టణంలోని పలువురి వద్ద సుమారు రూ.4కోట్ల మేర అప్పులు చేశాడు. ఎవరికీ చిల్లిగవ్వ చెల్లించకుండా ఒత్తిళ్లు తేవడంతో పట్టణం నుంచి ఉడాయించేందుకు పథకం ప న్నాడు. ఈ క్రమంలో 4 నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లిపోయాడు. తిరిగి సెలవును రెన్యూవల్ చేసుకోవడానికి శనివారం వచ్చిన అతన్ని బాధితులు పట్టుకుని నిలదీశారు.
పట్టణంలోని సుభాష్‌రోడ్డుకు చెందిన పోలేపల్లె గిరిధర్ కుమార్ ఎల్‌ఐసీ కార్యాలయంలో హైగ్రేడ్ ఆఫీసర్ (హెచ్‌జీవో )గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగంతో పాటు షేర్‌మార్కెట్‌లో షేర్స్ కొనుగోలు చేయడం, చిట్స్ నిర్వహిం చడం, ఫైనాన్స్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో తన కార్యాలయంలోని ఏ జెంట్ల వద్ద సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యాపార నిమిత్తం పట్టణంలోని వందమంది దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. చీటీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వలేదు.
రియల్‌ఎస్టేట్‌లో భూములకు అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు చెల్లించలేదు. అధిక వడ్డీ ఇస్తానని ఏజెంట్ల వద్ద తీసుకున్న సొమ్ము చెల్లించలేదు. ఇవన్నీ తడిసి మోపెడయ్యాయి. సుమారు రూ.4కోట్ల మేర అప్పులు మిగిలాయి. మదనపల్లెలో సొంతిల్లుతో పాటు వాల్మీకిపురం మండలంలో భూములు, బెంగళూరులో ఇంటి స్థలం ఉంది. దీంతో అతనికి అప్పిచ్చిన వారు ఏనాటికైనా మన డబ్బులు వస్తాయని ఆశపడ్డారు.
ఇదిలా ఉండగా అందరిని నిలువునా ముంచే ప్రయత్నంలో గిరిధర్ తన ఉద్యోగానికి 4 నెలలు సెలవు పెట్టి మదనపల్లె విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని వద్ద డబ్బులు రావాల్సిన వారికి దిగులుపట్టుకుంది. ఈ క్రమంలో గిరిధర్‌కుమార్ ఐపీ పెట్టేందుకు కోర్టును కూడా ఆశ్రయించాడు. అయితే కోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించింది.
ఈ క్రమంలో ఉద్యోగానికి పెట్టిన సెలవు పూర్తయిపోవడంతో దాన్ని రెన్యూవల్ చేసుకునే క్రమంలో శనివారం మదనపల్లెలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వచ్చాడు. అతను రావడాన్ని తెలుసుకున్న బాధితులు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు. తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులు లేవని, ఉన్న ఆస్తులు అమ్మి ఇస్తానని చెబుతున్నా బాధితులు వినడం లేదు. అతని ఆస్తులు కూడా అటాచ్‌మెంట్‌లో పెట్టినట్టు తెలిసింది. అయితే బాధితులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.