కేసు నుంచి తప్పించేందుకు రూ.50 లక్షల డీల్..!
సాక్షి, గుంటూరు : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే కారణంతో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను విజయవాడ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలిసి కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. మైనర్ బాలికను క్రికెట్ బుకీల వద్దకు పంపిన బ్రోకర్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని సెల్ నుంచి వాట్సప్ ద్వారా 32 మందికి బాలిక ఫొటోలు వెళ్లినట్లు గుర్తించారు.
మైనర్ బాలికను రెండు రోజుల వ్యవధిలో సుమారు 20 మంది వరకూ శారీరకంగా అనుభవించినట్టు విజయవాడ పోలీసులు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది గుంటూరు జిల్లాకు చెందిన క్రికెట్ బుకీలు కావడంతో విజయవాడ పోలీసులు వారి ఫోన్ నంబర్ల ఆధారంగా గుంటూరులో వేట మొదలుపెట్టారు. వారందరి సమాచారం సేకరించిన పోలీసులు వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో గుంటూరు జిల్లాకు చెందిన సుమారు పన్నెండు మంది క్రికెట్ బుకీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం నరసరావుపేటకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు.
పోలీసులతో పనయితే సరి... లేదంటే రాజీ
నరసరావుపేటకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకోవడంతోపాటు మరి కొందరి కోసం విజయవాడ పోలీసులు ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న వారి బంధువులు తమ వారిని కేసు నుంచి తప్పించాలంటూ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత తనయుడిని ఆశ్రయించినట్టు సమాచారం. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించే సదరు యువనేత కేసు నుంచి తప్పించేందుకు రూ.50 లక్షలు ఖర్చవుతుందంటూ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.
అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకుని శనివారం తన అనుయాయులను విజయవాడకు పంపినట్లు సమాచారం. పోలీసులపై ఒత్తిడి తేవడంతోపాటు డబ్బులు ముట్టజెప్పి కేసు నుంచి తప్పించాలని చూస్తున్నట్టు తెలిపారు. అలా కుదరని పక్షంలో బాధిత మైనర్ బాలికకు ఆ డబ్బు ఇచ్చి కేసుతో నరసరావుపేటకు చెందిన బుకీలకు సంబంధం లేదని చెప్పించాలని చూస్తున్నట్లు తెలిసింది.