
ఎన్నికల తనిఖీల్లో రూ.7.77 లక్షలు స్వాధీనం
మద్వానిగూడెం (కలిదిండి), న్యూస్‌లైన్ :ఎన్నికల సందర్భంగా మద్వానిగూడెంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.7,77,600 నగదును పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి సురేష్‌కుమార్, ఎన్నికల జమాఖర్చుల అధికారి రామాంజనేయాచార్యులు కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా జున్నూరు గ్రామానికి చెందిన పి.నరసింహారావు, కె.సూర్యనారాయణరాజు కలిదిండి మండలం పడమటిపాలెం నుంచి మోటారుసైకిల్‌పై వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, రోశయ్య తనిఖీచేసి, వారి వద్ద రూ.7,77,600 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
ఈ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని సురేష్‌కుమార్, రామాంజనేయాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీమ్‌లీడర్ రామ్మోహనరావు, ఏఎస్‌ఐలు గుమ్మడి శ్రీనివాసరావు, కృష్ణారావు పాల్గొన్నారు. ఈనెల 13వ తేదీన ఈ చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.12.82 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.