ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సోమవారం నెల్లూరు, సూళ్లూరుపేట, కోట, మనుబోలు ప్రాంతాల్లో రూ.5.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కేసవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.3.54 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విద్యానగర్‌కు చెందిన ఆక్వా రైతు రాజేంద్రన్ గూడూరుకు కారులో రూ.1.60 లక్షలు తీసుకెళుతున్నాడు.
తనిఖీ చేసిన పోలీసులు ఆ నగదుకు సంబంధించిన ధ్రువపత్రాలు లేవని నిర్ధారించి స్వాధీనం చేసుకున్నారు. కోటకు చెందిన శేఖర్ మోటార్‌ై బెక్‌లో రూ.66 వేలు తీసుకెళుతుండగా పోలీసులు గుర్తించి ప్రశ్నించారు. అయితే తాను కొత్తగా మోటార్‌బైక్ కొనుగోలుకు వెళుతున్నట్లు తెలిపాడు. ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. గూడూరుకు వెళుతున్న ఆటోలో డక్కిలి మండలం ఆల్తూరుపాడుకు చెందిన వ్యాపారవేత్త కనుపర్తి చంద్రశేఖర్ రూ.1.28 లక్షలు తీసుకెళుతున్నాడు. నగదుకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.85 వేలు స్వాధీనం
మనుబోలు : మండలం పరిధిలోని జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి ఓ బొలేరో వాహనం నుంచి రూ.85 వేలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి గూడూరు వెళుతున్న మీనాక్షి పవర్ ప్లాంట్‌కు చెందిన బొలేరో వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో ఓ వ్యక్తి వద్ద రూ.85 వేల తీసుకెళుతుండగా విచారించారు. సదరు వ్యక్తి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శివకుమార్‌కు అప్పగించారు.
రూ.90 వేలు నగదు స్వాధీనం
నెల్లూరు (నవాబుపేట) : అల్లీపురానికి చెందిన దొడ్ల తిరుపాలరెడ్డి సోమవారం స్కూటీలో రూ.90 వేలు నగదును తీసుకుని వెళుతున్నాడు. చింతారెడ్డిపాళెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో పోలీసులు తనిఖీలు చేశారు. స్కూటీలో ఉన్న రూ.90 వేలు నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎటువంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
గరుడ బస్సులో రూ.50,900 పట్టివేత
సూళ్లూరుపేట : చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ గరుడ బస్సులో గేదెల బాబూరావు అనే వ్యక్తి నుంచి సోమవారం రాత్రి రూ. 50,900 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై గంగాధర్ తెలిపారు. హోలీక్రాస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులో తనిఖీలు చేస్తుండగా బాబూరావు వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బాబూరావు వ్యాపార లావాదేవీల్లో నగదు తీసుకెళుతున్నట్టు చెప్పినా తగిన ఆధారాలు లేవని ఎస్సై తెలిపారు.