సాక్షి, కడప : ఉద్యోగుల సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయమంటూ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో ప్రభుత్వ సేవలు నిలిచిపోనున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కనున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించనుంది. జన జీవనం అతలాకుతం కానుంది. మొత్తం మీద జిల్లాలో పాలన అటకెక్కనుంది. గెజిటెడ్ ఉద్యోగులు సైతం వివిధ రూపాల్లో ఆందోళనలు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఉపాధ్యాయులు సైతం ఎన్జీఓలు, వివిధ సంఘాల ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించారు.
జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల పరిధిలో 4200 మంది కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో 760 బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 7500 మందిఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. వీరు ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడంతోపాటు ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక కార్యచరణను సైతం రూపొందించారు. దీనికి సంబంధించి ఆర్టీపీపీలో 3800 మంది, ట్రాన్స్‌కోలో 1200, ఎస్‌పీడీసీఎల్‌లో 2500 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏపీఐఐసీ, హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. డీఆర్‌డీఏ, డ్వామా, పీఏఓ ఉద్యోగులతోపాటు జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు సమ్మెపై త్వరలో నిర్ణయం తీసుకోనుండడంతో జిల్లాలో పాలన స్తంభించనుంది.
ఇందులో 2680 మంది పోలీసులు సమ్మెకు దూరంగా ఉంటున్నారు. 2155 మంది గెజిటెడ్ ఉద్యోగులు ప్రస్తుతానికి సమ్మెలో పాల్గొనడం లేదు. దీంతోపాటు ఉపాధ్యాయులు సైతం సమ్మెకు సంబంధించి కార్యచరణ రూపొందించే పనిలో ఉన్నారు.
ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల సమ్మె బాట
Published Tue, Aug 13 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement