మా జీతాలు కాదు.. జీవితాలు ముఖ్యం!!
ఆరు పదుల రోజులు దాటిపోయాయి. ఇప్పటివరకు వారికి జీతాలు లేవు.. పొయ్యిలో పిల్లి లేవట్లేదు. ఆకలి కడుపులను అలాగే కట్టుకుంటున్నారు. అయినా, ఉద్యమ స్ఫూర్తిని మాత్రం వదలబోమంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్దలు ఏ ముహూర్తంలో రాష్ట్ర విభజన నిర్ణయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారో.. ఆ క్షణం నుంచే సీమాంధ్ర కాస్తా ఉద్యమాంధ్ర అయ్యింది.
ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఉద్యమబాట పట్టారు. ఏ నాయకుడూ పిలుపునివ్వకుండానే, ఎవరూ చెప్పకుండానే అందరూ రోడ్ల మీదకు వచ్చేశారు. వారందరికీ రెండు నెలలుగా జీతం రాళ్లు అందట్లేదు. ఇంట్లో పిల్లా జెల్లా ఏం తింటున్నారో తెలీదు. అయినా.. జీతాలు ముఖ్యం కాదు, కోట్లాది మంది రాష్ట్రవాసుల జీవితాలు ముఖ్యమనుకున్నారు. కలిసి కదిలారు.. ఒక్క గొంతై నినదించారు. తమకు కావాల్సింది తెలుగు జాతి ఐకమత్యమే కానీ, తెలుగు గడ్డ విచ్ఛిన్నం కాదన్నారు.
రెండు నెలలుగా తమ జీతాలను కూడా కాదనుకుని సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారు ఉద్యోగులు. ఆర్టీసీలో కండక్టర్‌గా చేస్తున్న రాజు తమకు కావాల్సింది సమైక్యాంధ్ర, పిల్లల భవిష్యత్తు అని చెప్పారు. తమకుటుంబాలకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అయినా సమైక్యాంధ్ర వచ్చేవరకు ఉద్యమిస్తామంటున్నారు ఏపీఎన్జీవోల కుటుంబ సభ్యులు.
పిల్లలను గుడి దగ్గర కూర్చోనైనా పెంచుకుంటాం కానీ.. సమ్మె మాత్రం విరమించం అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. దిగ్విజయ్ సింగ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. విభజన నిర్ణయం ఎందుకు వెనక్కి తీసుకోరో చూస్తామంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టుకున్నామని, పక్క ఇంటి వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నామని రాజమండ్రికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి రాజు చెప్పారు. దయతో ఇచ్చిన వాటిని స్వీకరించడానికి ఇష్టమే గానీ సమ్మె మాత్రం విరమించేది లేదన్నారు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు.
తమ ఇంట్లో ఆడవాళ్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు నెలలుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తిరుపతికి చెందిన ఆర్టీసీ కండక్టర్ తాజుద్దీన్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాల కంటే.. ఈ కష్టాలు తక్కువేనన్నారు. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉందని తాజుద్దీన్ భార్య హసీనా చెప్పింది. చాలీచాలని జీతాలతో నెట్టకొచ్చే తాము రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తిరుపతి ఆర్టీసీ కార్మికులు చెప్పారు. అయితే.. సమైక్యాంధ్ర కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తామని చెబుతున్నారు.