ఆర్టీసీకి రూ.400 కోట్ల నష్టం | RTC Rs .400 crore loss | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి రూ.400 కోట్ల నష్టం

Published Tue, Nov 19 2013 2:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:23 PM

RTC Rs .400 crore loss

=రూ.100 కోట్లతో తిరుపతి బస్టాండ్ అభివృద్ధి
 =మౌలిక వసతుల కోసం ప్రయాణికులపై రూ.1 సెస్సు
 =2016 తర్వాతే కొత్త్తడిపోల ప్రారంభం
 =శబరిమలకు 354 ప్రత్యేక బస్సులు
 =నెల్లూరు జోన్ ఆర్టీసీ ఈడీ సూర్యప్రకాష్‌రావు వెల్లడి

 
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఇటీవల నెల్లూరు ఆర్టీసీజోన్ పరిధిలో రూ.400 కోట్ల మేర నష్టాలను భరించాల్సివచ్చిందని ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ సీ.సూర్యప్రకాష్‌రావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన బి.కొత్తకోటలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నెల్లూరుజోన్ పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని బస్సుల నిర్వహణ వల్ల రూ.100 కోట్ల మేర నష్టం, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో బస్సులు నడపకపోవడం వల్ల రూ.300 కోట్ల నష్టం వచ్చినట్టు తెలిపారు.

ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ప్రయాణికులపై రూ.1 సెస్సును విధించినట్టు చెప్పారు. ఇది పల్లెవెలుగు, సీటీ బస్సులకు మినహాయింపునిచ్చినట్టు ఆయన గుర్తుచేశారు.  తమ పరిధిలో ఈ సెస్సుద్వారా నెలకు రూ.80 లక్షలు వసూలవుతోందని, ఈ మొత్తం ఏడాదికి రూ.8కోట్లవుతుం దని తెలిపారు. ఈ నిధులతో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యం కోసం నీటివసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, బల్లలను విస్తరించడం, అప్రోచ్‌రోడ్ల నిర్మాణంలాంటి చర్యలు చేపడతామన్నారు.

2014-15, 16 ఆర్థిక సంవత్సరాల్లో బస్టాండ్లకు మహర్దశకలగనుందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని మంగళం డిపో ప్రారంభమైందని, కొత్తగా చంద్రగిరి, కృష్ణపట్నం, ముత్తుకూరు, ఇంకోల్లు, ఒంగోలు-2, మన్నవరం డిపోలకు ప్రతిపాదనలు పంపామని తెలి పారు. ఇవి 2016లో మంజూరవుతాయని చెప్పారు. తిరుపతి బస్టాండ్‌ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేశామన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద జోన్‌కు కొత్తబస్సులొచ్చాయన్నారు. ఇందులో తిరుపతికి 120, చిత్తూరుకు 40, నెల్లూరుకు 50, ఒంగోలుకు 50 బస్సులు వచ్చినట్టు ఆయన వివరించారు.

ఇవికాకుండా మరో 70 బస్సులు వచ్చాయని, ఇంకా 40 బస్సులు రావాల్సివుందని తెలిపారు. శబరిమల యాత్రకు 354 బస్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. తిరుపతి నుంచి 294, నెల్లూరు నుంచి 50, ఒంగోలు నుంచి 10 బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ మూడు జిల్లాల నుంచి కర్ణాటక, తమిళనాడుకు అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిపారు. తమిళనాడుతో సమావేశం జరగాల్సి ఉందన్నారు. 40 బస్సులు కర్ణాటకకు నడిపేందుకు అంగీకారం కుదిరిందని, చిత్తూరు నుంచి తమిళనాడుకు 100 బస్సులు నడిపేందుకు ఒప్పందం జరగాల్సివుందని చెప్పారు. ఆయన వెంట ఈఈ వెంకటరమణ, మదనపల్లె-1 డీఎం ప్రభాకర్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement