
నిరసన హోరు
కొనసాగిన ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు
ఇబ్రహీంపట్నంలో భిక్షాటన నగరంలో మానవహారం
జిల్లా వ్యాప్తంగా 728 సర్వీసులు నడిపిన అధికారులు
విజయవాడ : జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మంగళవారం కూడా నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో ఆర్టీసీ కార్మికులు అన్ని ప్రధాన డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికుల సమ్మె ఏడో రోజూ కొనసాగింది. అయితే అధికారులు జిల్లాలో 728 సర్వీసులను నడిపారు. దూర ప్రాంతాలైన చెన్నై, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, వైజాగ్ మినహా అన్ని ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. బస్సులు సగటున 50 శాతం వరకు నడుస్తున్నా సంస్థకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో కార్మిక సంఘాల నేతలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్‌స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి బయటకు వెళ్లే బస్సులను అడ్డుకున్నారు.
పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో బస్సులు యథావిధిగా నడిచాయి. అనంతరం కార్మికులు బస్‌స్టేషన్ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. అక్కడినుంచి కంట్రోల్ రూమ్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్మించారు. దీంతో బందరు రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులపై బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదని సూచించారు. 43 శాతం ఫిట్‌మెంట్ సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అక్కడి నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
జిల్లాలో.. తిరువూరు, గుడివాడ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం తదితర బస్ డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తిరువూరులో ఆర్టీసీ డిపో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. బస్టాండ్‌లో కార్మిక సంఘాలు సభ నిర్వహించాయి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకటరామారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగ్గయ్యపేట డిపో వద్ద కార్మికులు చెవిలో పూలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలో నిరసన ప్రదర్శన జరిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైస్‌చైర్మన్ అక్బర్ మద్దతు ప్రకటించారు.
గుడివాడ బస్ డిపో ప్రధాన ద్వారం వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నంలో కార్మికులు ప్రధాన రహదారుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. నూజివీడు డిపో అద్దె బస్సు డ్రైవర్‌పై మెర్సుపూడి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రాయి విసిరిన సంఘటనలో డ్రైవర్ గాయపడ్డారు.
కోర్టుకు రేపు చెబుతాం..
హైకోర్టుకు తమ నిర్ణయాన్ని న్యాయవాది ద్వారా బుధవారం వెల్లడిస్తాం. న్యాయపరంగా సాధించుకోవాల్సిన హక్కుల కోసం చట్టానికి లోబడే సమ్మె చేస్తున్నాం. దీనిపై అన్ని సంఘాల నేతలతో మాట్లాడుతున్నాం. బుధవారం 10.30 గంటలకు నేరుగా నిర్ణయం వెల్లడించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం.
- వై.వి.రావు,
ఈయూ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి