కేంద్రం తీరు అప్రజాస్వామికం
నిరసనగా అసెంబ్లీలో ఎంపీ, మాజీ ఎంపీల ధర్నా
సాక్షి, హైదరాబాద్: అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, అంజన్‌కుమార్ యాదవ్, సురేశ్ శేట్కర్, మల్లు రవి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు గాంధీవిగ్రహం దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నించారు.
అసెంబ్లీ లోపల గేట్లకు తాళం ఉండటంతో విగ్రహానికి ఎదురుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... అవినీతిపరులకు కేంద్రం అండగా ఉంటున్నదన్నారు. అవినీతిపరులపై చర్య తీసుకోవాలని కోరిన ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని విమర్శించారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట తరువాత వారిని పోలీసులు అరెస్టు చేశారు.