రైట్.. రైట్
ముగిసిన ఆర్టీసీ సమ్మె
43 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వ అంగీకారం
రోడ్డెక్కిన బస్సులు
ఊపిరి పీల్చుకున్న ప్రజలు
కర్నూలు (రాజ్‌విహార్) : కార్మిక శక్తి మరోసారి పైచేయి సాధించింది. శ్రమకు తగిన వేతనం రాబట్టుకునేందుకు ప్రభుత్వం, యాజమాన్యంపై సాగించిన పోరులో విజయం వరించింది. రోడ్డు రవాణా సంస్థలో కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గింది. సుదీర్ఘ చర్చల అనంతరం 43 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకారం తెలపడంతో సమ్మెకు తెరపడింది. కార్మికులు, ఉద్యోగులు సంబరాలు చేసుకోగా.. బస్సులు రోడ్డెక్కడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియర్ నేతలు గత నెలలో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం పీఆర్సీ ఇవ్వాలని.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి 2013 ఏప్రిల్ 1 నుంచి వేతన బకాయి చెల్లించాలని.. సంస్థ పరిరక్షణ దృష్ట్యా డీజిల్‌పై పన్నులో రాయితీ ఇవ్వడంతో పాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
ఈనెల 6 నుంచి చేపట్టిన సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ), వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌తో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. జిల్లాలోని మొత్తం 11 డిపోల్లో 4,800 మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో ఆఫీసర్ స్థాయి అధికారులు 48 మంది. వీరు తప్ప 4,752 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.
ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రైవేట్ అభ్యర్థులను వినియోగించుకొని అనధికారికంగా కొన్ని బస్సులను తిప్పినా ఫలితం లేకపోయింది. అయితే ఎనిమిది రోజుల పాటు కొనసాగిన సమ్మె బుధవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వం దిగిరావడంతో కార్మికులు విధులకు హాజరయ్యారు.
రూ.6కోట్లకు పైగా నష్టం
జిల్లాలోని 11 డిపోల్లో 970 బస్సులు ఉండగా.. 371 రూట్లలో 4లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తున్నాయి. రోజు ఆదాయం రూ.1.10 కోట్లు ఉంటోంది. సమ్మె కారణంగా మొదటి రోజు 970 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. మొత్తంగా సమ్మె కారణంగా సంస్థ రూ.6కోట్లకు పైగా ఆదాయం కోల్పోయినట్లు రీజినల్ మేనేజరు పి.కృష్ణమోహన్ తెలిపారు.
దశ తిరిగింది!
Published Thu, May 14 2015 5:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement