43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం
జేఏసీ నాయకుల సంబరాలు
కడప అర్బన్, ఎడ్యుకేషన్ : ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఏడు రోజులుగా నిర్వహించిన సమ్మె బుధవారం 8వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులతో జరిగిన చర్చల ఫలితంగా కార్మికుల ప్రధాన డిమాండ్ 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి సంబరాలు చేసుకున్నారు.
ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో బుధవారం సాయంత్రం బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అంతకుముందు కడప నగరంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్‌స యూనియన్ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు.
ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఎస్వీబీ రాజేంద్రప్రసాద్, రీజినల్ అధ్యక్షుడు నాగముని, కోశాధికారి చెన్నయ్య, కడప డిపో అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాశం, ఏఆర్ మూర్తి, ఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సురేష్, జోనల్ కార్యదర్శి పీవీ శివారెడ్డి, కడప డిపో కార్యదర్శి డీడీఎస్ మణి, బీఎంఎస్ నాయకులు, ఇతర సంఘాల నాయకులు, కార్మికులు సంబరాల్లో పాలుపంచుకున్నారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
మహిళా ఉద్యోగుల్లో ఆనందం
ఆర్టీసీలో కండక్టర్లుగా పనిచేస్తున్న తమను కూడా ఉద్యమంలో భాగస్వాములు చేసి మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. మిగతా కార్మికులతోపాటు మహిళా ఉద్యోగులకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ వర్తించేలా నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది.- ప్రమీల, మహిళా కండక్టర్
అన్ని వర్గాల వారు మద్దతిచ్చారు
ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని వైఎస్సార్‌సీపీ, బీజేపీ, వివిధ సంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు. అందరూ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో తమవంతు పాత్ర పోషించారు.- రాములమ్మ, మహిళా కండక్టర్
భవిష్యత్తులో వేతన సవరణకు మార్గం సుగమం
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం సంతోషదాయకం. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వేతన సవరణ జరిగినపుడు అదే స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేందుకు మార్గం సుగమమైంది.
- ఎస్వీబీ రాజేంద్రప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు
కేసులన్నీ ఎత్తి వేయాలి..
కార్మిక సంఘాలు ఐక్య పోరాటం వల్ల ప్రభుత్వం దిగివచ్చి 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. కేసులన్నీ ఎత్తివేసి కార్మికులకు న్యాయం చేయాలి. అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేస్తే కార్మిక కుటుంబాలు వీధినపడకుండా గాడిలో పడతాయి.
- పీవీ శివారెడ్డి, ఎన్‌ఎంయూ జోనల్ కార్యదర్శి
ఆనందంగా ఉంది
ప్రభుత్వం, యాజమాన్యం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులకు న్యాయబద్దంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రతి కార్మికునికి న్యాయం జరిగినట్లైయింది.
- ఎస్.నాగముని, ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు
సమిష్టి పోరాటం వల్ల ప్రభుత్వం దిగి వచ్చింది
కార్మికులకు న్యాయం జరిగేందుకు ప్రతి యూనియన్ ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వానికి, యాజమాన్యానికి సమస్య తీవ్రతను తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం దిగివచ్చింది. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం భరోసా కల్పించినట్లయింది.
- జీవీ నర్సయ్య, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి
రోడ్డెక్కిన బస్సులు
Published Thu, May 14 2015 4:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement