పల్లె వెలుగులకు  అల్ట్రా సొగసులు | RTC's new services | Sakshi
Sakshi News home page

పల్లె వెలుగులకు  అల్ట్రా సొగసులు

Published Wed, Oct 18 2017 3:57 AM | Last Updated on Wed, Oct 18 2017 4:13 AM

RTC's new services

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్‌ బస్సులను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ కొత్తగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటివరకు దూర ప్రాంత సర్వీసులుగా అంతర్‌ జిల్లాల్లో తిప్పుతున్న ఆల్ట్రా డీలక్స్‌ బస్సుల్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పల్లె వెలుగు చార్జీలతోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సుల్ని ప్రయోగాత్మకంగా వైఎస్సార్‌ జిల్లా, తిరుపతిలలో ప్రవేశపెట్టింది. డీలక్స్‌ బస్సుల్లో ఉండే పుష్‌బ్యాక్‌ సీట్లు, ఎల్‌ఈడీ బల్బులు, ఎల్‌ఈడీ టీవీలను వీటిల్లో ఏర్పాటుచేశారు. పల్లెవెలుగు బస్సులతో నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ భావిస్తున్న తరుణంలో ప్రయోగాత్మకంగా పల్లెలకు ఆల్ట్రా డీలక్స్‌ సర్వీసులు ప్రవేశపెట్టడంతో ఆక్యుపెన్సీ రేషియో అనూహ్యంగా పెరిగింది. దీంతో ఈ నెలలో కృష్ణా రీజియన్, విజయవాడలలో కూడా వీటిని ప్రవేశపెట్టి, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. 

వైఎస్సార్‌ జిల్లాలో పెరిగిన ఆక్యుపెన్సీ 
వైఎస్సార్‌ జిల్లాలో సెప్టెంబరు 1న రాజంపేట బస్‌ డిపోలో ఈ ఆల్ట్రా డీలక్స్‌ బస్సులు ప్రారంభించారు. రాజంపేట నుంచి నందలూరు, ఒంటిమిట్ట, బాకరాపేట మీదుగా కడపకు ఈ సర్వీసులు ప్రారంభించారు. పల్లెవెలుగు బస్సుల ఛార్జీల మాదిరిగానే కనీస చార్జీ రూ.6గా ఆల్ట్రా బస్సులకూ నిర్ణయించారు. పల్లెవెలుగు బస్సుల్లానే స్టాప్‌ల సంఖ్య పెంచారు. పాస్‌లను కూడా అనుమతించడంతో విద్యార్ధులు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉంది. వీటన్నింటి కారణంగా ఒక్క నెలలోనే వీటి ఆక్యుపెన్సీ 80 శాతానికి పెరిగింది. 

ప్రైవేటు సర్వీసులకు ధీటుగా సౌకర్యాలు 
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 700 ప్రైవేట్‌ బస్సుల వరకు చట్ట వ్యతిరేకంగా కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లు తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లతో ప్రైవేటు బస్సులు తిప్పడంతో ఏడాదికి ఆర్టీసీకి రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. గ్రామీణ రూట్లలో ఆటోలవల్ల ఈ నష్టం మరింత పెరుగుతోంది. వీటిల్లో ప్రయాణిస్తే రెండు మూడు కిలోమీటర్లకు రూ.10 వసూలు చేస్తున్నారు. అదే ఆల్ట్రా డీలక్స్‌ బస్సులో కనీస చార్జి రూ.6గా వసూలు చేస్తున్నారు. మరోవైపు.. ప్రైవేటు వాహనాలవల్ల పెరుగుతున్న ప్రమాదాలపై కూడా ఆర్టీసీ ప్రచారం చేసేందుకు నిర్ణయించింది. అదే ఆర్టీసీలో ప్రమాదాల శాతం ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.09గా ఉంది.

ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల సంఖ్య ఇదీ.. 
రాష్ట్రంలో పల్లెవెలుగు బస్సుల సంఖ్య: 1,436 
ఆల్ట్రా డీలక్స్‌ బస్సుల సంఖ్య: 101 
రాష్ట్రంలో తిరుగుతున్న ఆటోల సంఖ్య: 1.20 లక్షలు 
కాంట్రాక్టు క్యారేజీ అనుమతి పొంది తిరుగుతున్న పైవేట్‌ బస్సుల సంఖ్య : 655 

పల్లెలకు మరిన్ని సౌకర్యాలు
రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలతో ఆర్టీసీ సర్వీసులను గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. ప్రైవేటు వాహనాల కంటే తక్కువ చార్జీతో ప్రారంభించి సంస్థను ప్రయాణికులకు మరింత చేరువ చేయాలని ఆలోచిస్తున్నాం. అలాగే, పల్లెలకు ఆల్ట్రా డీలక్స్‌ సర్వీసులు విజయవంతమయ్యాయి. అన్ని సర్వీసులు కలుపు కుంటే ఆక్యుపెన్సీ గత ఏడాది కంటే ఎనిమిది శాతం పెరిగింది. సంస్థకు ఒక్క శాతం ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే రూ.60 కోట్ల ఆదాయం పెరుగుతుంది. 
– జయరావు, ఈడీ (ఆపరేషన్స్‌)

రవాణాలో...  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement