
మంత్రా... మజాకా
సాక్షి ప్రతినిధి, కడప: ట్రాన్సుపోర్టు శాఖలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కోరుకున్నంత అప్పగిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులిస్తున్నారు. ఆర్టీఓ అవసరం ఉన్నచోట పోస్టింగ్ ఇవ్వకపోగా డిప్యూటీ c ఉన్న చోటే అదనంగా ఆర్టీఓను నియమిస్తూ సరికొత్తగా ఆదేశించారు. ఇందుకు ఓఎమ్మెల్యే సంపూర్ణ సహకారం అందించారు. ఉన్న పోస్టులో ఎలాగైనా కొనసాగాలనే లక్ష్యంతో ఓ అధికారి లకారాలను సమర్పించుకుని పనిచక్కబెట్టుకున్నారు. జిల్లా కేంద్రమైన కడపలో డీటీసీ ప్రొద్దుటూరులో ఆర్టీఓ కార్యాలయం ఉన్నాయి. ప్రొద్దుటూరు ఆర్టీఓ ఆనందరాజు నవంబర్ 31న పదవీవిరమణ చేశారు.
ఆస్థానంలో రవీంద్రకుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో ఆర్టీఓ పోస్టు కీలకం. ప్రొద్దుటూరుతోబాటు బద్వేల్, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాలు ఆర్టీఓ కార్యాలయ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ వార్షిక ఆదాయం రూ.6.5కోట్లు పైబడి ఉంది. అలాంటి కీలకమైన కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్థానాన్ని భర్తీ చేయాల్సిన యంత్రాంగం మిన్నకుండిపోతోంది. అందుకు కారణం రాజకీయ పైరవీలేనని పలువురు పేర్కొంటున్నారు.
మనోడే కదిలించొద్దు....
ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి ఆర్టీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవీంద్రకుమార్‌ను తొలగించవద్దని రాజకీయ పైరవీలు ముమ్మరం అయినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో బాటు, మరో ఎమ్మెల్యే సంబంధిత మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇటీవలే అదనపు బాధ్యతలు తీసుకున్నారు,. ఎలాగైనా కదిలించవద్దు అంటూ అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
దీంతో జిల్లా కేంద్రంలోని డీటీసీ కార్యాలయంలో ఆర్టీఓ పోస్టును భర్తీ చేసినట్లు సమాచారం. ముందుగా ఖాళీ ఉన్న స్థానాన్ని భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నా ట్రాన్స్‌పోర్ట్ కమిషనరేట్ కార్యాలయం మంత్రి ఒత్తిడికి తలొగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అస్లాంబాష ఆర్టీఓగా కడపలో నే డు బాధ్యతలు చేపట్టనున్నారు. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునేందుకు, అధికార పార్టీ నేతల మద్దతు కూడగట్టడంలో ప్రొద్దుటూరు అధికారి సఫలం కావడంతో ఈ ఉత్తర్వులు వెలుబడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అధికారపార్టీ నేతలకు లకారాలు సమర్పించుకున్నట్లు సమాచారం.