గ్రామదర్శిని కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చినబాబు, మాజీ సర్పంచ్ కడలి త్రిమూర్తులు మధ్య వాగ్వివాదం
పశ్చిమ గోదావరి, దేవరపల్లి : టీడీపీ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం కృçష్ణంపాలెంలో మంగళవారం వాగ్వివాదానికి దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనవ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల సమస్య గురించి అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నిలదీశారు. భూమిలేనందున స్థలాలు ఇవ్వలేక పోతున్నామని, రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు వస్తే చెప్పండి కొనుగోలు చేస్తామని, సమస్యలు వెంటనే పరిష్కారం కావని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమాధానం ఇవ్వడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఓట్లు ఎందుకు వేయించుకున్నారని, ఒక్కొక్క ఇంటిలో నాలుగు కుటుంబాలు ఉంటూ ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడంలేదని మహిళలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాలు అడిగితే కార్యకర్తలను నాయకులు దుర్భాషలాడారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కె.చినబాబులతో కడలి త్రిమూర్తులు, కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు, మహిళలు వాగ్వివాదానికి దిగారు. సుమారు గంటసేపు వివాదం జరిగింది.
అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని కాలనీ వాసులు బహిష్కరించారు. గ్రామంలో జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని, పార్టీ జెండాలు మోసే కార్యకర్తలకు అన్యాయం జరగుతున్నా పట్టించుకోవడంలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతగల పేదలకు సంక్షేమ పథకాలు అందడంలేని, అర్హతలేని అగ్రవర్ణాలకు పథకాలు అందుతున్నాయని కాలనీ వాసులు ఆరోపించారు. ఇల్లు కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులకు మొక్కవలసి వస్తోందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్వీ నరసింహరావు, ఏఎంసీ ఛైర్మన్ ముమ్మిడి సత్యనారాయణ, ఎంపీడీఓ కె.కోటేశ్వరరావు, సర్పంచ్ కె. దుర్గాశ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కె.రవికుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment