- సెప్టెంబర్ 14న నిర్వహణ
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల అమ్మకానికి సెప్టెంబర్ 14న మళ్లీ వేలం నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సమీపంలో ఉన్న 82.11 ఎకరాల భూమి అమ్మకానికి గతేడాది మార్చి 28న అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వేలం నిర్వహించడం.. తెలుగుదేశం పార్టీ నేతలు కారుచౌకగా ఆ భూముల్ని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను ‘సాక్షి’ బట్టబయలు చేయడం తెలిసిందే. సత్రం భూముల్ని అధికారపార్టీ నేతలు తక్కువ ధరకే కొట్టేసే ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. భూములకు తిరిగి వేలం నిర్వహించాలని న్యాయస్థానం రాష్ట్రప్రభు త్వాన్ని ఆదేశించడం కూడా విదితమే.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. సత్రం భూముల అమ్మకానికి తిరిగి వేలం నిర్వహించడంపై కసరత్తు చేసిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు బుధవారం రాష్ట్రప్రభుత్వా నికి నివేదిక అందజేశారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో ఏదో ఒకరోజు వేలం నిర్వహణకు తాము సిద్ధమని నివేదించగా.. 14న వేలం నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం అనుమతి తెలిపింది. కాగా వేలం నిర్వహణకు తొమ్మిదిమంది దేవాదాయశాఖ అధికారుల తో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు.