పెళ్లయిన తొలిరోజు రాత్రే ఆమెకు కాళరాత్రిగా మారింది. శాడిస్టు భర్త చేతిలో చిత్రహింసలకు గురైంది. నరకాన్ని చవి చూసింది. తీవ్ర గాయాలతో బయట పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంగాధరనెల్లూరు: పెళ్లంటే పందిళ్లు..సందళ్లు.. తాళాలు..తలంబ్రాలు..అంటారు కవులు.. ఆ అమ్మాయి కూడా ఇలానే భావించింది. 24 గంటలు తిరగక మునుపే నరకం ఎలా ఉంటుం దో ప్రత్యక్షంగా చూసింది. తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే మర్నాడే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. గంగాధరనెల్లూరు మండలం పెద్ద దామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి వ్యవసాయం చేసుకుంటారు. ఆడబిడ్డను బాగా చదవాలని భావించారు. డిగ్రీతో సరిపెట్టకుండా కుమార్తె శైలజను ఎంబీఏ కూడా చదవుకోమని ప్రోత్సహించారు.
ఈలోగా కుమార్తెకు ఓ టీచరు సంబంధం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. వి.కోట మండలంలో పనిచేసే టీచరు రాజేష్‌తో కుమార్తెకు పెళ్లి సంబంధం నిశ్చయం చేసుకున్నారు. ఇతనిది జీడీ నెల్లూరు మండలం మోతరంగనపల్లి. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రాజేష్‌తో శుక్రవారం ఉదయం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు. అదే రోజు తొలిరాత్రి శైలజకు కాళరాత్రి ఎదురైంది.
భర్త అసలు విషయం తెలుసుకుని తల్లిదండ్రుల వద్ద వాపోయింది. దీంతో రాజేష్ మృగంలా మారిపోయాడు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. అతడి వికృత చేష్టలకు తీవ్రంగా గాయపడింది శైలజ. తొలిరోజే ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో నవ వధువు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ముఖం గుర్తించలేనంతగా గాయాలతో కమిలిపోయింది. పెళ్లిపీటలపై అందంగా కనిపించిన శైలజ అదే రోజు రూపం మారిపోయి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనను నిలువునా వంచించాడంటూ కుంగిపోయింది. నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గంగాధరనెల్లూరు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment