శైలజానాథ్.. గో బ్యాక్ | Sailajanath .. Go back | Sakshi
Sakshi News home page

శైలజానాథ్.. గో బ్యాక్

Published Wed, Aug 28 2013 5:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్‌కు మంగళవారం అనంతపురం నగరంలో సమైక్య సెగ తగిలింది. అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి.

చేసిందంతా మీరేనంటూ కనిపించిన కాంగ్రెస్, టీడీపీ నేతలను జనం తూర్పారబడుతున్నారు. రాష్ట్ర విభజనపై జనాగ్రహం మిన్నంటింది. ఎన్‌జీఓలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు.. కూలీనాలీ చేసుకునే మామూలు జనం సైతం రోడ్డుపైకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఎదుట నిలుచోవాలంటేనే భయపడే జనం.. నేడు ధైర్యంగా గో బ్యాక్ అంటూ నినదిస్తున్నారు. మీరు రాజీనామాలు ఆమోదించుకుని రండి.. విభజన దానంతటదే ఆగిపోతుందని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా మారింది.
 
 అనంతపురం న్యూ టౌన్, న్యూస్‌లైన్ :  రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్‌కు మంగళవారం అనంతపురం నగరంలో సమైక్య సెగ తగిలింది. అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి.‘ శైలజానాథ్ గోబ్యాక్’ అంటూ ప్రజలు, ఉద్యోగులు నినదించారు. మంత్రి శైలజానాథ్ సూచన మేరకు మంగళవారం ఉదయం పది గంటలకు అనంతపురంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శింగనమల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు.
 
 అయితే... ఈ సభ గంటన్నర ఆలస్యంగా 11.30 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు మంత్రి శైలజానాథ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి స్థానిక నాయక్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరారు. సర్వజనాస్పత్రి మీదుగా వస్తుండగా అక్కడే రిలే దీక్షలు చేస్తున్న సమైక్యాంధ్ర డాక్టర్ల జేఏసీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
 
 ఆయన దీక్షా శిబిరం వద్దకు వస్తుండగానే డాక్టర్లు, ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా, మంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శిబిరం నుంచి రోడ్డుపైకి వచ్చి మంత్రిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీఐలు శ్రీనివాసులు, గోరంట్ల మాధవ్ ఉద్యమకారులకు అడ్డంగా స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు. వారిని ఛేదించుకుని మంత్రిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. డాక్టర్ల జేఏసీ నాయకులకు నచ్చజెప్పేందుకు సీఐ గోరంట్ల మాధవ్ ప్రయత్నించినా వారు వినలేదు. ‘శైలజానాథ్ గో బ్యాక్’ అంటూ పెద్దఎత్తున నినదించారు. ఇదే సందర్భంలో శైలజానాథ్ అనుచరుడు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాదాగాంధీ రెచ్చిపోయారు. డాక్టర్ల జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. మహిళా నేతలపైనా నోరు పారేసుకున్నారు. ‘మీ పని మీరు చేసుకోలేరా? అతి ప్రసంగాలు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరుపై మహిళా నేతలు ఆవేదన, అగ్రహం వ్యక్తం చేస్తూ తిట్ల వర్షం కురిపించారు. దీంతో సీఐ విజయ్‌కుమార్ దాదాగాంధీని వెనక్కు తీసుకువెళ్లి.. మహిళా ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులంతా మరోసారి శైలజానాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ జెడ్పీ కార్యాలయం ఎదురుగా వెళుతుండగా అక్కడే రిలే దీక్షలు చేస్తున్న జెడ్పీ, పంచాయతీరాజ్ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు.
 
 నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని, చెవులు మూసుకుని, వెనక్కు తిరిగి కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సభా వేదికకు సమీపంలోనే దీక్షలు చేస్తున్న మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులు శైలజానాథ్ ప్రసంగించే సమయంలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండా దీక్షా శిబిరంలోని మైక్‌ల సౌండ్ మరింత పెంచారు. అంతకుముందు సభా ప్రాంగణానికి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, న్యాయవాది నారాయణరెడ్డిలను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు.  
 
 అడుగడుగునా పోలీసులే
 మంత్రి శైలజానాథ్ సభ సందర్భంగా పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. సీఐలు శ్రీనివాసులు, విజయ్‌కుమార్, గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్, మధుభూషణ్ ఆధ్వర్యంలో ఎనిమది మంది ఎస్‌ఐలు, 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, సివిల్ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సభా ప్రాంగణానికి సమీపంలోని సప్తగిరి సర్కిల్, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ప్రాంతంలో పోలీసులు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు, జీపులు పెట్టి.. ఉద్యోగ జేఏసీ నేతలు కానీ, ప్రజాసంఘాల నేతలు కానీ అటువైపు రాకుండా చూశారు.
 
 రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినా పదవులను పట్టుకుని వేలాడుతుండడంతో మంత్రి శైలజానాథ్‌పై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల వలయంలో వెంట వచ్చిన వారిని ముందు కూర్చోబెట్టుకుని సభ నిర్వహించాల్సి వచ్చింది. సభ ముగిసిన తరువాత మంత్రి ఇంటికి వెళుతున్నప్పుడు కూడా వందలాది మంది స్పెషల్ పార్టీ పోలీసులు రక్షణగా నిలిచారు.
 
 అనుకున్నదొకటి.. అయింది మరొకటి
 సమైక్యాంధ్ర సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రయత్నించిన మంత్రి శైలజానాథ్‌కు చుక్కెదురైంది. పది వేల మందితో సభ నిర్వహించాలని మంత్రి భావించారు. జన సమీకరణ బాధ్యతను మార్కెట్‌యార్డ్ చైర్మన్ నారాయణరెడ్డితో పాటు జగ్గాల రవి, నరసింహారెడ్డి తదితరులకు అప్పజెప్పారు. వారు రాత్రింబవళ్లు కష్టపడినా వెయ్యి మందిని కూడా తీసుకురాలేకపోయారు. శింగనమల నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం మండలాల నుంచి ఓ మోస్తరుగా, నార్పల మండలం నుంచి కొద్దిమంది మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు.
 
 యల్లనూరు, పుట్లూరు మండలాల నుంచి ఒక్కరూ రాలేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జగన్‌కు జై కొడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. కేతిరెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి యల్లనూరు మండలంలో ఉంది. కేతిరెడ్డి కుటుంబానికి శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు, పుట్లూరు మండలాల్లో మంచి పట్టు ఉంది. వారి కారణంగానే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాకే శైలజానాథ్‌కు భారీ మెజార్టీ వచ్చింది. అయితే... కేతిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన నేపథ్యంలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి శైలజానాథ్ విశ్వప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement