
టీడీపీ మానిఫెస్టోకు ఆర్.బి.ఐ అనుమతి ఉందా?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాటకు కట్టుబడి మహానాయకుడని మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ అభివర్ణించారు. ఎన్నికల నేపథ్యంలో మహానేత వైఎస్ఆర్ ఇచ్చిన హమీ ప్రకారం ఉచిత విద్యుత్ను సీఎం పదవి చేపట్టిన వెంటనే ఆయన అమలు చేశారని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన రైతు రుణ మాఫీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు.
రైతు రుణమాఫీ చేయకుండా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. రుణమాఫీకి ఆర్బీఐ అభ్యంతరం చెబుతుందని చంద్రబాబు అంటున్నారు... టీడీపీ మానిఫెస్టోకు ఆర్బీఐ అనుమతి ఉందా అంటూ శైలజానాథ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రం కోసం గతంలో కర్నూలు కోల్పోయామని శైలజానాథ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. హైకోర్టు, ఏయిమ్స్, ఐఐటీ వంటి సంస్థలను రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి శైలజానాథ్ సూచించారు.