
సాక్షి, హైదరాబాద్: అసత్య ప్రచారాలు చేసే లక్షణం టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైఎస్ షర్మిళపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం గురించి హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశామని, ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. వ్యక్తిత్వ హననానికి దిగడం టీడీపీ రాజకీయ ఎజెంగా పెట్టుకుందని, రాజకీయంగా ఎదుర్కొలేకనే తమ పార్టీ నేతలపై చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేయిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి చర్య అత్యంత నీచమైనదని, అసహ్యకరమైనదని అన్నారు.
ఇది కేవలం వైఎస్ షర్మిళపై జరిగిన విష ప్రచారం కాదని, మహిళలపై జరిగిన దాడి ఇది అని ఆయన పేర్కొన్నారు. ఆమెపై అసత్య ప్రచారం చెయ్యడంలో టీడీపీ నేతల హస్తం లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబసభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.