సాక్షి ప్రతినిధి, కడప : చెప్పేందుకే శ్రీరంగ నీతులు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. కొద్ది పాటి నిధులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వెనుకాడుతూ రాజకీయ ఉన్నతి కోసం రాజ్యాంగ విలువలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. జూలై నాటికి మైలవరం, గండికోట ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని జిల్లా పర్యటనలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. హైదరాబాద్‌కు వెళ్లాక ఆ హామీని మర్చిపోయినట్లు ఉన్నారనే వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్‌లో జీఎన్‌ఎస్‌ఎస్‌కు కేటాయించిన నిధులే ఇందుకు నిదర్శనమని పలువురు వివరిస్తున్నారు.
ఈ పరిస్థితిలో ఆరోపణల సుడిగుండం నుంచి తప్పించుకుంటూ.. స్వలాభం చూసుకుందామని ‘పట్టిసీమ’ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా పులివెందులకు నీరు తెస్తామని టీడీపీ నేతలు సెలవిస్తున్నారు. వీరి వాదనలు ఏ విధంగా సాధ్యమో అర్థం కావడం లేదని సాగునీటి రంగ నిపుణులు వాపోతున్నారు. పట్టిసీమ నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి, శ్రీశైలం ద్వారా రాయలసీమకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ నేతలూ అదే వాదనను భుజానికెత్తుకున్నారు.
ఇందులో సాధ్యాసాధ్యాల గురించి పరిశీలించకుండానే పులివెందులకు నీరొస్తుందంటూ ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌రెడ్డి తాజాగా సోమవారం పులివెందులలో ఏకంగా ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశమైంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల కనీస నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వడం సాధ్యమనే వాస్తవాన్ని ‘కళ్లుండి చూడలేని దుస్థితి’లో అధికార పార్టీ నేతలు ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ప్రభుత్వం మొన్నటి దాకా నీరు తీసుకెళ్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వీరు ఈ ప్రాంతానికి యోగ్యకరమైన చర్యల్ని విస్మరించి, ఎలాంటి అదనపు ప్రయోజనం లేని పట్టిసీమ కోసం రచ్చ చేయడం సరైంది కాదంటున్నారు.
అధినేత మెప్పు కోసమే ర్యాలీ..
ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌రెడ్డి శాసన మండలి డిప్యూటీ చైర్మన్. జిల్లా వాసికి మండలిలో ఉన్నత స్థానం లభించడంతో జిల్లాభివృద్ధికి తోడ్పాటుగా ఉంటుందని అభివృద్ధి కోరుకునేవారంతా భావించారు. అభివృద్ధి అటుంచితే అధినేత మెప్పు కోసమే ఆయన చర్యలు ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన స్థాయిని మరిచి గల్లీ సవాళ్లు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందులలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీ నిర్వహిస్తే, అధినేత వద్ద మార్కులు దక్కుతాయనే ఎత్తుగడతోనే సోమవారం సాయంత్రం నాటి కార్యక్రమని పలువురు విశదపరుస్తున్నారు.
ఇందులో భాగంగానే వ్యూహత్మకంగా రాజ్యాంగ హోదాను సైతం మరిచి వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయనకు ఈ ప్రాంతం పట్ల నిజంగా ప్రేమ ఉంటే.. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా జూలై నాటికి జిల్లాలో గండికోట, మైలవరం రిజర్వాయర్లుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా (1995-2004) తొమ్మిదేళ్ల పాలనా కాలంలో సాగు నీటి ప్రాజెక్టుల్ని పూర్తిగా విస్మరించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు రూపొందించారు. ఈ పథకానికి తొమ్మిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేవలం రూ.17 కోట్లు వెచ్చించారు. తీవ్ర దుర్భిక్షం తాండవిస్తోన్న పులివెందుల ప్రజలకు యోగ్యమైన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సిబిఆర్)కు సైతం రూ.10 కోట్లు ఖర్చు చేశారు. వెలిగల్లు ప్రాజెక్టుకు రూ.7.19 కోట్లు ఖర్చు చేయగా, తెలుగుగంగ ప్రాజెక్టుకు మాత్రమే రూ.198.7 కోట్లు వెచ్చించారు. జిల్లా ప్రాజెక్టుల కోసం వాస్తవంగా చంద్రబాబు కేటాయించిన నిధులివి. వాస్తవమిలా ఉంటే తమ వల్లే నీరు వచ్చిందని, అభివృద్ధి అంతా తామే చేశామని టీడీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు.
ఎవరి మెప్పు కోసమో!
Published Tue, Mar 24 2015 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM
Advertisement
Advertisement