ఎచ్చెర్ల క్యాంపస్/రణస్థలం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పూర్వ నాగరికతలన్నీ నదీపరివాహక ప్రాంతాల్లోనే విరాజిల్లాయని, నదుల అనుసంధానంతోనే ప్రగతి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జిల్లాలో వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టు, మహేంద్రతనయపై ఆఫ్‌షోర్ ప్రాజెక్టు వంటి పెండింగ్ పనులన్నీ ఈ ఏడాది లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదికి హారతి ఇచ్చారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.30 గంటల కు ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయం వద్దనున్న హెలిఫ్యాడ్ వద్దకు చేరుకున్నారు.
బీఆర్‌ఏయూ వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రామ్‌జీ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్.హరశ్రీరాములు, రిజిస్ట్రార్ కొరుపోలు రఘుబాబు సీఎంకు స్వాగతం పలికారు. చంద్రబాబు అక్కడి నుంచి తమ్మినాయుడుపేట వద్దకు వెళ్లి జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజలు నిర్వహించి నూతన వస్త్రాలను నదిలో విడిచిపెట్టారు. అనంతరం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమానికి హాజరయ్యారు. తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు పాత కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. టెక్కలి నియోజకవర్గంలో తలపెట్టిన చిన్నసాన ఎత్తిపోతల ప«థకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం వద్ద వెలుగు, మహిళాశిశు సంక్షేమ శాఖ, ఉద్యానవన శాఖ, సూక్ష్మనీటి సేద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
అనంతరం రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. నదీ జలాలు వృథాపోకుండా ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవడంపై ప్రజలను చైతన్యం చేయడానికే జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. మంత్రి కళా విన్నపాల మేరకు రణస్థలం మండలం కొండములగాంలోని సామాజిక ఆస్పత్రి స్థాయిని 30 నుంచి 50 పడకలకు పెంచుతామని హామీ ఇచ్చారు. లావేరు మండలంలోని బుడుమూరు నారాయణ సాగరం చెరువును రూ. 10 కోట్లుతో మినీ రిజర్వాయరుగా మార్చుతామని చెప్పారు.
అయితే ఈ హామీని 2014 ఎన్నికల సమయంలోనే కళావెంకటరావు ఇవ్వడం గమనార్హం. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గంలో విస్తరించి ఉన్న ఫార్మా పరిశ్రమలలో యువతకు ఉపాధి కల్పించేలా బీ ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలన్న కళా వినతికి సీఎం సానుకూలంగా స్పందించారు. అయితే రూ.50 కోట్ల నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వంశధార రెండో దశ ప్రాజెక్టు పనుల్లో గత పాలకులు ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.
భావనపాడు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నదుల అనుసంధానంతోనే సాగు, తాగునీటి సమస్యలు ఉండబోవని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జిల్లాపరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మిదేవి, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషా, మాజీ స్పీకరు కావలి ప్రతిభాభారతి, పార్టీ నాయకులు చౌదరి బాబ్జీ, కొండ్రు మురళీ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించారు.
అర్ధంతరంగా వెనుదిరిగిన ఎమ్మెల్యే శివాజీ...
పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీకి అలక అలంకారమని పేరు. పలు సందర్భాల్లో దాన్ని ప్రదర్శిస్తుంటారు కూడా. శనివారం సీఎం కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. బహిరంగసభ వేదికపైకి కూడా వెళ్లారు. కానీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, టీడీపీ జిల్లా మహిళా నాయకురాలు తమ్మినేని సుజాత వేదికపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. ఇది గమనించిన శివాజీ వేదికపై నుంచి దిగివెళ్లి వారిని వదలాలని కోరారు. కానీ పోలీసులు ససేమిరా అనడంతో శివాజీ అలకబూనారు. ఆయితే సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనతో చెప్పించాలని చూశారు. కానీ సీఎం పట్టించుకోకుండా వేదికపైకి వెళ్లిపోవడంతో శివాజీ చిన్నబుచ్చుకున్నారు. తర్వాత ఎంతమంది నాయకులు వెళ్లి బతిమాలినా వేదికపైకి వెళ్లకుండా అక్కడి నుంచి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment