సాగుదారు గుండె చప్పుడే ఈ చట్టం.. | Sakshi Interview With Srikakulam MLA Dharmana Prasada Rao | Sakshi
Sakshi News home page

సాగుదారు గుండె చప్పుడే ఈ చట్టం..

Published Tue, Aug 6 2019 7:55 AM | Last Updated on Tue, Aug 6 2019 7:55 AM

Sakshi Interview With Srikakulam MLA Dharmana Prasada Rao

సాక్షి, శ్రీకాకుళం: ‘సాగు రైతులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. రైతులకు ఎంత ఇచ్చినా చాలదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా ఎక్కువగా చేయగలిగారు. బడ్జెట్‌లో మాగ్జిమమ్‌ మొత్తం వ్యవసాయానికి డైవర్ట్‌ చేశారు. ఎవరైనా హర్షించాల్సిందే. ఎవరైనా కాదనలేనిదే. ఒకవేళ కాదన్నా... ఇంకొక రకంగా బాధపడ్డా.. రైతుల పీక నొక్కడం తప్ప, వారి కన్నీరు చూడడం తప్ప, వారి ఆవేదనకు వ్యతిరేకంగా పనిచేయడం తప్ప ఇంకొకటికాదు. కౌలుదారి చట్టం ప్రవేశపెట్ట డం వెనక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి.

కోట్లాది మంది ఆవేదన ఉంది. ఎన్నో ఆత్మహత్యలు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఈతి బాధలు ఉన్నాయి. నిరాశ నిస్పృహ ఉంది. ఆకలి కూడా ఉంది. రైతులు, బలహీన వర్గాల పక్షపాత ప్రభుత్వమిది. కొత్త ఐడియాలజీతో వెళ్తున్న ఈ ప్రభుత్వం ఎవరికి అండగా నిలుస్తుందో శాసన సభలో చేసిన 14 చట్టాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి’ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తన అనుభవ సారంతో కొత్త ప్రభుత్వం ఆత్మను ఆవిష్కరించారు. సోమవారం ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారాయన. ఈ సందర్భంగా చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

వ్యవసాయం చేస్తున్నోడికే ఇకపై రాయితీలు
పండించేవాడికే ఇన్సెంటివ్‌ ఇవ్వాలి. దాని కోసం దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా మొదటిసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేసింది. వ్యవసాయ భూమి కలిగి ఉన్నవాడికి కాదు.. వ్యవసాయం చేస్తున్నోడికి సాయం అందాలి. సాగు చేస్తున్న వారు వేరు.. భూ యజమాని వేరు. మొట్టమొదటిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ తేడాను గుర్తించారు. దేశంలోనూ, రాష్ట్ర స్థాయిలో అనేక ఇన్సెంటివ్‌లు ఈ రంగానికి వస్తున్నాయి. వచ్చినా వ్యవసాయం చేసిన వాడికి వెళ్లనంతకాలం అది అసలైన సపోర్టు కాదు. ప్రభుత్వమేమో సాయం ఫలానా వ్యక్తికి వెళ్లాలని అనుకుంటుంది. కాని అనుకున్న వ్యక్తికి వెళ్లడం లేదు. అది కొంత నివారించి, సరిచేసి ప్రాక్టికల్‌గా ఆ దిశగా తీసుకెళ్లే చట్టం ఇది. రాయితీలన్నీ కౌలు రైతులకు అందించడమే దీని లక్ష్యం.

రైతుకు స్వేచ్ఛ ఎక్కడిది?
వ్యవసాయం రానురాను కష్టమైపోయింది. భూమి గల వారిలో ఎక్కువమంది వ్యవసాయాన్ని వదిలేశారు. వేరే వాళ్లు సాగు చేస్తున్నారు. ఈ రంగానికి కొత్తగా వచ్చిన సవాళ్లు ఏంటి? వ్యవసాయానికి వినియోగించే సరుకులు, వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ట్రాక్టర్‌ తీసుకుంటే రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు అవుతుంది. డీజిల్‌కు రూ.80 అవుతుంది. ఇన్సూరెన్స్‌ రూ.15 వేలు. అంటే మూడెకరాలు చేస్తే మిగిలిన ధాన్యం గింజలు అమ్మితే ఇన్సూరెన్స్‌ వస్తుంది. అదే సమయంలో వాటి ఉత్పత్తి ఖరీదు పెరగలేదు. అది ఇక పెరగదు. ఉత్పత్తి ఖరీదు దేశంలో పెరిగే పరిస్థితి లేదు. ఉత్పత్తి ధర పెరగకపోవడానికి కారణం ఆహార గింజలు. దేశంలో 130 కోట్ల జనాభాకు అందించడానికి ఎక్కువ ధరైతే ఆ పని చేయలేరు.

అందుకోసం రైతు పీక నొక్కే పని జరుగుతున్నది. స్వేచ్ఛగా తానింతకు అమ్ముకుంటానని, గిట్టుబాటుకు అమ్ముకుంటా నని చెప్పే, అడిగే స్వేచ్ఛ రైతుకు లేదు. మిగతా ఉత్పత్తిదారులకు మాత్రం ఆ వెసులుబాటు ఉంది. ట్యాక్స్, ముడి సరుకు ధరలు, లేబర్‌ చార్జీలు... వీటితోపాటు వడ్డీ కలుపుకుని ధర నిర్ణయిస్తారు. ఆ పరిస్థితి రైతుకు లేదు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కొంతకాలానికి పాడవుతున్నాయి. దానికి మౌలిక సౌకర్యాలు రావా లి. కొనుగోలుదార్లు వచ్చేవరకు ఆగి అమ్మే సిస్టమ్‌ రావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రావాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లు ఏర్పాటు చేయగలగాలి. ఇంత పెద్ద ఎత్తున ఉపాధినిచ్చే రంగం మరొకటి లేదు. దానికోసం వ్యవసాయ రంగాన్ని సపోర్టు చేయాల్సిందే. ఈ దేశంలో 70 శాతంమంది వ్యవసాయం మీద బతుకుతున్నారంటే వారందరి కోసం వ్యవసాయ రంగంపై ఖర్చు పెట్టాల్సిందే.

జాతీయ ఉత్పత్తులకు ఉపాధి దెబ్బ
నేషనల్‌ ప్రోడక్ట్‌పై ఉపాధి చట్టం దెబ్బకొట్టింది. సాగు చేసే భూమికి కూలీలు కొరత ఉండటం, ఉన్న కూలీలు సకాలంలో దొరకకపోవడం వల న, దొరికినా వారి వేతనాలు భారీగా పెరగడం వలన సాగు చేసే భూమి తగ్గిపోతున్నది. అందుకనే కొన్ని ప్రాంతాల వ్యవసాయ భూముల వద్దకు వెళ్లితే పంటలు కన్పించడం లేదు. ఎందుకని అడిగితే కూలీలు దొరకడం లేదని చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు.

బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వమిది
కొత్త ఐడియాలజీతో వచ్చిన పార్టీ కనుక ఆ ఆశయాలను అమలు చేయడానికి అవసరమైన చట్టాన్ని తీసుకురావడమే ప్రధానమైన అంశంగా శాసన సభ నడిచింది. రెవెన్యూపై సందేహాలుండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన, ఉద్దేశమేంటో ప్రజలకు అర్థమై ఉంటుంది. ఏ వర్గాలకు కొమ్ముకాయాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది? ఎవరి ప్రయోజనాలను రక్షించడానికి ఇది పనిచేస్తుందనేదానికి ఈ శాసన సభ, చట్టాలతోనే ఒక సంకేతం పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ దిశగా వెళ్తుంది? ఏ వర్గాల ప్రయోజనాలను కాపాడుతుంది? ఏ వర్గాల కష్టాన్ని తీర్చడానికి  తాపత్రాయం పడుతుంది? ఏ దిశగా వచ్చే రెవెన్యూను ఖర్చు పెట్టాలని చూస్తుంది? అనే దానిపై ఈ శాసన సభలో క్లారిటీ వచ్చింది. అవగాహన ఉన్న వారికి వీటి విలువేంటో తెలుస్తుంది.

అల్పాదాయ వర్గాలకు, నిస్పృహలో ఉన్నవారికి, నిరాశ చెందిన వృత్తిదారుల వారికి, దెబ్బతిన్న వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఊతమిచ్చి నిలబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతుందని శాసనసభ ద్వారా చెప్పడం జరిగింది. చట్టాలు చూసినా, బడ్జెట్‌ కేటాయింపులు చూసినా ఈ ప్రభుత్వం గమనం అర్థమవుతుంది. కొద్ది సమయంలో ఇన్ని చట్టాలు చేసిన సందర్భాల్లేవు. ప్రభుత్వం కొత్త ఐడియాలజీ డైరెక్షన్‌లో నడుస్తోంది. దానికి అవసరమైన చట్టాలు తీసుకొచ్చింది. అవసరమైతే సవరణలు కూడా తెచ్చుకోవచ్చు.

వైఎస్సార్‌ భావజాల ప్రభుత్వమిది..
అధికారంలోకి వచ్చిన కొత్త రాజకీయ పార్టీ మాది.. తొమ్మిదేళ్ల క్రితం ఆవిర్భవించవచ్చు. ఈ పార్టీకి ఒక భావజాలం ఉంది. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పుట్టినటువంటి పార్టీ ఇది. వైఎస్సార్‌ పాలన అందించడానికి ఒక పార్టీ ఉంటే బాగుండునని ప్రజలు ఆలోచించడం ద్వారా వచ్చిన ఒత్తిడితో మహానేత కుమారుడు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఇది. వైఎస్సార్‌ భావజాలంతో వచ్చినటువంటి పార్టీ ఇది. శాసనసభా సమావేశాలను ప్రజల ఆకాంక్షను తీర్చడానికి వినియోగించారు. ఆ దిశగా సభ నడిచింది.

పాదయాత్రలో గమనించిన సమస్యలకు పరిష్కారం
గడిచిన కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, అనేక వృత్తులు, అనేక సామాజిక వర్గాలు, ఆ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, వృత్తుల్లో ఉన్న సమస్యలు, జీవన విధానంలో ఎదురైనటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. కళ్లారా చూసి చలించిపోయిన విషయాలకు మేనిఫెస్టోలో చోటు కల్పించారు. అంతటితో సరిపోదని బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. వాటిని ఖర్చు పెట్టేందుకు 14 చట్టాలు తయారు చేశారు. ఆ చట్టాలు తయారు చేసేందుకు ఈ శాసన సభను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement