యువ సైనిక.. విజయ గీతిక | Sakshi special story with Army Lieutenant Vinod | Sakshi
Sakshi News home page

యువ సైనిక.. విజయ గీతిక

Published Mon, Dec 31 2018 12:23 PM | Last Updated on Mon, Dec 31 2018 12:23 PM

Sakshi special story with  Army Lieutenant Vinod

ఎంటెక్‌ పూర్తి చేశాడు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు ముంగిట ఉన్నా దేశ సేవ చేయాలనుకున్నాడు. ఆర్మీలో చేరాలని కసరత్తు మొదలు పెట్టాడు. అనుకున్నట్లుగానే విజయం సాధించాడు. కఠోర శిక్షణను అధిగమించాడు.  ప్రస్తుతం దేశ సరిహద్దులో లెఫ్ట్‌నెంట్‌గా దేశ రక్షణ రంగంలో సేవ లందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఆదోనికి చెందిన వినోద్‌. ఇటీవల సెలవుపై పట్టణానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను ఆర్మీ ఉద్యోగాన్ని ఎంచుకోడానికి కారణాలు? తల్లిదండ్రుల ఆకాంక్ష, తాను ఇష్టమైన ఉద్యోగం సాధించేందుకు చేసిన కృషి, తదితర వివరాలు ఆయన మాటల్లో..  – ఆదోని

 ‘మా నాన్న కావలి రాజు భవన నిర్మాణ కార్మికుడు. ప్రస్తుతం మేస్త్రీగా పనులు చేయిస్తున్నారు. అమ్మ లీలావతి గృహిణి. ఇద్దరు పెద్దగా చదువుకోలేదు. నాకు తమ్ముడు విష్ణు, చెల్లలు వినీత ఉన్నారు. మా చదువంతా  ప్రైవేట్‌ స్కూళ్లలోనే కొనసాగింది. ఇంటర్‌ పూర్తి కాగానే ఇంజిజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష రాయగా అత్యుత్తమ ర్యాంక్‌ రావడంతో గీతం యూనవర్సిటీలో అడ్మిషన్‌ లభించింది. బీటెక్‌తో పాటు ఎంటెక్‌ కూడా అక్కడే పూర్తి చేశాను.  ఆ తర్వాత ఆర్మీ చేరాలనే ధ్రుడమైన కోరికతో తమిళనాడుకు చెందిన మరో ఐదుగురు స్నేహితులతో కలిసి 2015లో కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ప్రవేశ పరీక్షలు రాశాను.

 నాకు మాత్రం ఆర్మీలో లెఫ్టెనెంట్‌ గ్రేడ్‌–1 ఆఫీసర్‌గా ఉద్యోగ అవకాశం లభించింది. ఉద్యోగంలో చేరగానే ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమిలో శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 18 నెలల పాటు శిక్షణ కొనసాగింది. దేశ రక్షణకు శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, తెగింపు, దేశభక్తి లాంటి పలు అంశాలపై జరిగే శిక్షణ కఠినంగా ఉంటుంది. రాత్రివేళల్లో అడవిలో జట్టుగా 30 నుంచి 60 కి.మీ. ఇందుకు నిర్దిష్టమైన సమయం ఇస్తారు. నిర్ణీత సమయంలో గమ్యం చేరుకోవాల్సి ఉంటోంది. వాహనాలు, హెలికాఫ్టర్, విమానం, డ్రైవింగ్‌తో పాటు వైద్య రంగంలో అత్యవసర వైద్య చికిత్స అంశాలు కూడా శిక్ష ణలో భాగమే. శిక్షణ విజయవంతంగా ముగించుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్‌ గ్రేడ్‌–1 ఆఫీసరుగా 2016 జూన్‌  10వ తేదీన∙నియమిస్తూ ఆర్మీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజు నేను లెఫ్ట్‌నెంట్‌ గ్రేడ్‌–1 అధికారిగా బాధ్యతలు చేపట్టాను. 

ప్రాణాలర్పించడం అదృష్టంగా భావిస్తారు 
2017లో లెఫ్ట్‌నెంట్‌గా బాధ్యతలు స్వీకరించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్నా. ఒక్కో బృందంలో 33 మంది దాకా సైనికులు ఉన్నారు. అవసరమైనప్పుడు ఈ సంఖ్య పెరుగుతోంది. దేశ సరిహద్దుపై డేగ కన్ను ఉంటోంది. ఉగ్రవాదులు, శత్రువుల కదలికలపై డేగ కన్ను ఉంటోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసే ఆదేశాల మేరకు నా బృందంతో పని చేయిస్తున్నాను. దేశంలోని కోట్ల మంది ప్రాణాలకు రక్షణగా  దేశ సరిహద్దుల్లో  కాపలా కాస్తున్న నాతో సహా సైనికులందరూ ఎంతో గర్వ పడతారు. సైన్యంలో పనిచేయడమంటే పూర్వజన్మ సుకృతమన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సైన్యంలో ఉన్నవారికి దేశ ప్రజల కోసం ప్రాణార్పణకు వెనకాడరు. ప్రాణాలర్పించడాన్ని అదృష్టంగా భావిస్తారు.    

ఆనంద బాష్పాలు రాలాయి 
బాధ్యతలు చేపట్టిన రోజు అమ్మనాన్న లీలావతి, రాజును ఉత్తరఖండ్‌లోని డెహ్రడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమి కార్యాలయానికి పిలిపించారు. ర్యాంకిగ్‌ బ్యాడ్జ్‌ని అమ్మానాన్నతో నా ఆర్మీ యూనిఫాంకు తగిలించారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్‌ నుంచి పూలవాన కురిసింది. ఒక్క సారిగా సభికుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఉన్నతస్థాయి అధికారులు, దేశ పౌరులు, వేలాది మంది సైనికుల సమక్షంలో లభించిన గౌరవంతో అమ్మానాన్న ఆనందంతో ఉప్పొంగిపోయారు. నన్ను అలింగనం చేసుకున్న అమ్మనాన్న కళ్లల్లో  ఆనంద బాష్పాలు రాలాయి.   

ఆర్మీలో చేరుందుకు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ
సైన్యంలో రాష్ట్రానికి చెందిన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇది బాధాకరం. ఏటా ఇతర రాష్ట్రాల నుంచి 50 నుంచి 60 మంది వరకు నా స్థాయి ర్యాంకు వాళ్లు ఆర్మీలో చేరుతున్నారు. అయితే మన రాష్ట్రం నుంచి వచ్చే వారి సంఖ్య ఐదారు మందికి మించడం లేదు. దీంతో ఆర్మీపై ప్రజలలో సరైన అవగాహన లేదనిపిస్తోపంది. ఆర్మీ అంటేనే అడవుల్లో కాపలా కాయడమని, కష్టాలను ఎదుర్కోవడమనే అపవాదు ఉంది. కొంత వరకు ఇది వాస్తమే అయినా ఇందుకు నాలుగింతలు ఉద్యోగ సంతృప్తి ఉంటోంది. ప్రభుత్వం, సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటోంది. అందుకే సెలవుల్లో వచ్చినప్పుడు యువతలో ఆర్మీ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని భావిస్తున్నాను. ఇతర రాష్ట్రాలకు సమానంగా మన రాష్ట్రం నుంచి కూడా ఆర్మీ చేరేందుకు ప్రోత్సాహం అందిస్తాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement