మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర | sakshi sting operation on liquor mafia in andhra pradesh | Sakshi
Sakshi News home page

మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర

Published Thu, Dec 26 2013 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

sakshi sting operation on liquor mafia in andhra pradesh

* గోవా, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నెలకు 100 కోట్ల లిక్కర్
* మద్యం మాఫియా నకిలీ దందాపై ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్
* బ్యూటేన్ పేరుతో ఈఎన్‌ఏ, సర్జికల్ కిట్‌లో క్యారామిల్, సీసా మూతల రవాణా..  గోవా డిస్టిలరీల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్
* కంటెయినర్ల ద్వారా పెయింట్లు, బిస్కెట్లు, నూడుల్స్ పేరుతో రవాణా
* ఆఫీసర్స్ చాయిస్, డీఎస్‌పీ, బ్యాగ్‌పైపర్ వంటి బ్రాండ్లకు నకిలీలు
* రూ. 3,200 ధర గల క్వార్టర్ బాటిళ్ల కేసు రూ. 1,800 ధరకే సరఫరా
* మద్యం వ్యాపారి పేరుతో మాఫియాను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధి
* షాద్‌నగర్ హైవేపై దాబా వద్ద గ్యాంగ్ లీడర్‌తో సమావేశం
* తర్వాత ఉప్పల్‌లో మళ్లీ భేటీ.. నకిలీ సరుకు కోసం ఒప్పందం
* శాంపిల్‌గా రెండు కేసుల ఎన్‌డీపీ లిక్కర్ పంపిన మాఫియా నేత
* మద్యం ముడిసరుకులను తెప్పించే ముఠానూ కలిసిన ‘సాక్షి’
* ఆ దందా కేంద్రం అబిడ్స్ బ్యాంక్ స్ట్రీట్‌లోని ఓ సెల్‌ఫోన్ షాపు
* ‘సాక్షి’ ప్రతినిధిని ట్రాన్స్‌పోర్ట్ గోడౌన్ వద్దకు తీసుకెళ్లిన నిర్వాహకులు
* అక్కడికక్కడే డ్రమ్ముల్లో ఈఎన్‌ఏ, విస్కీ ఎసెన్స్, సీళ్లు ఇచ్చిన వైనం
 
వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి:  రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులుగా పారుతోంది. చాపకింద నీరులా విస్తరించిన మద్యం మాఫియా.. మందుబాబులకు బాటిళ్లలో నకిలీ కిక్కును సరఫరా చేస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి లారీలకు లారీలను నకిలీ మద్యం దించేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టటంతో పాటు.. మందుబాబుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతోంది. నెలకు కనీసం రూ. 100 కోట్ల పైబడి సాగుతున్న ఈ నకిలీ మద్యం దందా.. ప్రధానంగా పేద, దిగువ మధ్య తరగతికి చెందిన వారు తాగే చీప్ లిక్కర్, మీడియం లిక్కర్ బ్రాండ్లను టార్గెట్ చేసుకుని సాగిపోతోంది.

ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ బదిలీ, రాష్ట్ర విభజన వివాదాలు మద్యం మాఫియాకు కలసిరావటంతో.. ఈ నకిలీ వ్యాపారం మూడు డ్రమ్ముల న్యూట్రల్ ఆల్కహాల్, ఆరు లారీల సరుకుగా యథేచ్ఛగా నడుస్తోంది. గోవా నుంచి ఆంధ్రాజిల్లాలకు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు నకిలీ మద్యం దిగుమతి అవుతోంది. ఈ మద్యం మాఫియా దందా కారణం గా ప్రభుత్వ మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.

మద్యం మాఫియా నకిలీ దందాపై ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. మద్యం వ్యాపారి పేరుతో.. మాఫియా గ్యాంగ్ లీడర్లతో మాట్లాడింది. ఒక్క రోజు లోనే రూ. 32 లక్షల విలువైన 1,000 పెట్టెల నకిలీ మద్యం తెచ్చి ఇచ్చేందుకు ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుంది. శాం పిల్‌గా గోవా నుంచి కొంత ఎన్‌డీపీ (నాన్-డ్యూటీ పెయిడ్) మద్యాన్ని, కర్ణాటక నుంచి 220 లీటర్ల ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)ను ‘సాక్షి’ ప్రతినిధి తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం దందా సాగుతున్న తీరు తెన్నులు ఇవీ...

మద్యం మాఫియా పొరుగు రాష్ట్రాల నుంచి రెండు రకాలుగా నకిలీ మద్యాన్ని మన రాష్ట్రంలోకి తెస్తోంది. ఒకటి.. గోవా డిస్టిలరీల నుంచి నేరుగా ఎన్‌డీపీ లిక్కర్. అంటే అక్కడ డిస్టిలరీల్లో దొంగతనంగా తయారు చేసిన మద్యాన్ని.. మన రాష్ట్ర ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా దొంగతనంగా తెప్పించి ఇక్కడ షాపులకు సరఫరా చేయటం. రెండోది.. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మద్యం ముడిసరుకులను దొంగతనంగా తెప్పించి, రహస్యంగా నకిలీ మద్యం తయారు చేసి, పాత బాటిళ్లలో నింపి షాపులకు సరఫరా చేయటం. ఈ రెండు రకాల మద్యం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు కనీసం 100 నుంచి 150 లారీల వరకు వస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది.

కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఇలా...
* కర్ణాటకలోని హుబ్లి, కోలార్, గంగావతి; మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వీఆర్‌ఎల్ ట్రాన్స్‌పోర్టులో బ్యూటేన్, ప్రొఫేన్ కెమికల్ పేరుతో ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)ను డ్రమ్ముల్లో తెప్పిస్తారు. అదే పద్ధతిలో.. సీసాలపై వేసే లేబుళ్లు, మూతల సీళ్లు, క్యారామిల్, విస్కీ ఎసెన్స్‌ను కూడా సర్జికల్ కిట్ల పేరు మాటున తెప్పిస్తారు.
     

* ఈ నకిలీ మద్యం దందా, నగదు లావాదేవీలు హవాలా పద్ధతిలో సాగుతాయి. ఎలాగంటే.. మాఫియా గ్యాంగ్‌లు రాష్ట్రంలో పలు చోట్ల కిళ్లీ కొట్లు, సెల్‌ఫోన్ దుకాణాల రూపంలో ఆఫీసులు తెరిచాయి. ఇలాంటి ఆఫీసులే కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పెట్టారు. బ్రోకర్ల ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. వ్యాపారులతో ఫోన్ కాంటాక్ట్ పెట్టుకోవటం లేదు.
     

* నకిలీ మద్యం కావాలనే లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటారు. పొరుగు రాష్ట్రం ఆఫీసుకు ఫోన్ చేసి డబ్బు ముట్టిందని చెప్తారు. ఎంత సరుకు పంపాలో వివరిస్తారు. అంతకంటే ఎక్కువ సంభాషణ ఉండదు. అక్కడివాళ్లు ఈఎన్‌ఏ, క్యారామిల్, తదితర ముడిసరుకులను సదరు కంపెనీలకు డబ్బు కట్టేసి తీసుకుంటారు. వాటిని వేరే ఏవో పేర్లతో ట్రాన్స్‌పోర్టులో పంపుతారు.
     

* ఇక్కడి లిక్కర్ వ్యాపారులు ట్రాన్స్‌పోర్టు నుంచి ఈఎన్‌ఏ, ఇతర ముడిసరుకులను తీసుకుని ఒక రహస్య గోదాంకు తరలిస్తున్నారు. మూడున్నర లీటర్ల ఈఎన్‌ఏకు ఐదున్నర లీటర్ల నీళ్లు కలిపి.. దానికి క్యారామిల్, విస్కీ ఎసెన్స్ కలిపి మద్యం తయారు చేస్తున్నారు. అంతకంటే ముందే వైన్ షాపుల నుంచి ఖాళీ క్వార్టర్ సీసాలను, హాఫ్ బాటిళ్లు, ఖాళీ అట్టపెట్టెలను సేకరించి గోదాంకు చేర్చుతున్నారు. తయారు చేసిన నకిలీ మాద్యాన్ని సీసాల్లో నింపి మూతలు పెట్టి క్యాప్ సీల్ వేస్తున్నారు. ఈ మద్యం చూడటానికి ఏపీబీసీఎల్ డిపో నుంచి వచ్చినట్టే ఉంటుంది. వాటిని అంతకు ముందే తెచ్చిన ఏపీబీసీఎల్ అట్టపెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి షాపుల్లో విక్రయిస్తున్నారు.

తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఆఫీసర్స్ చాయిస్, రాయలసీమ జిల్లాల్లో డీఎస్‌పీ, బ్యాగ్‌పైపర్ లిక్కర్‌ను ఎక్కువగా తయారు చేసి పంపుతున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ మద్యంలో హైగ్రో మీటర్ వేసి చూస్తే అసలు మద్యం కొలతలనే చూపిస్తోంది. యూపీ 25 శాతం, ప్రూఫ్ 75 శాతం ఉంటుంది.

* ఇలా నకిలీ మద్యం తయారు చేసిన వ్యక్తి.. దానిని రెండో వ్యక్తికి ఒక్కో కేసు (క్వార్టర్ బాటిళ్లు అయితే 48, ఫుల్ బాటిళ్లు అయితే 12) రూ. 1,800 చొప్పున అమ్ముతున్నాడు. అతనేమో దుకాణం యజమానికి రూ. 2,000 నుంచి రూ. 2,100 వరకు విక్రయిస్తున్నాడు. దుకాణం యజమాని రూ. 2,900 చొప్పున బెల్టు దుకాణాలకు వేస్తున్నారు. బెల్టు దుకాణాల వారు రూ. 3,200 ధరకు వినియోగదారులకు అమ్ముతున్నారు.

మద్యం దందాపై ‘స్టింగ్’ ఆపరేషన్ ఇలా...
నకిలీ మద్యం దందాపై దృష్టిసారించిన ‘సాక్షి’ ప్రతినిధి ముందుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో నిజాయితీపరులైన కొంత మంది అధికారులతో మాట్లాడి.. వారి వద్ద ఉన్న సమాచారం తీసుకున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మద్యం మాఫియా బ్రోకర్లను కలిసేందుకు ప్రయత్నించారు. పెద్దగా కష్టపడకుండానే ఓ మధ్యవర్తిని కలిశారు. ‘‘మాకు రంగారెడ్డి జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్, మద్యం షాపు ఉన్నాయి. లాభాలు లేవు. మీరు సెకండ్ మాల్ ఇప్పిస్తారని తెలిస్తే మీ కోసం నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం’’ అని ఆ మధ్యవర్తితో చెప్పారు. నకిలీ లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంత మంది వ్యక్తుల పేర్లు, వారితో ఉన్న పరిచయాల గురించి చెప్పి ఆయనకు న మ్మకం కలిగించారు.

గ్యాంగ్ లీడర్‌తో ముఖాముఖి...
సదరు మధ్యవర్తి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ హైవే పైన ఉన్న విజయ దాబా వద్ద.. ఓ మద్యం మాఫియా గ్యాంగ్ లీడర్‌కు .. మద్యం వ్యాపారిగా ‘సాక్షి’ ప్రతినిధిని పరిచయం చేశాడు. ఆ గ్యాంగ్ లీడర్ ఈ ప్రతినిధిని, ఆయనతో వచ్చిన సహచరుడిని అనేక ప్రశ్నలు అడిగి వారు నిజమైన మద్యం వ్యాపారులేనని రూఢి చేసుకున్నాడు. చివరికి.. ‘‘సరే! రేపు పొద్దున మా మనుషులు వచ్చి మీ షాపులు చూస్తారు.. అక్కడే దగ్గర ఉండండి’’ అని వారికి చెప్పాడు. అతడి ఫోన్ నంబర్ ఇవ్వాలని ‘సాక్షి’ ప్రతినిధి అడిగితే.. నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పాడు. ‘‘ఈ వ్యాపారంలో ఎప్పుడు కూడా ఫోన్ వాడొద్దు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

మద్యం దుకాణం యజమానిగా...
మరుసటి రోజు ‘సాక్షి’ ప్రతినిధి ఇచ్చిన వైన్స్ షాపు దగ్గరకు అనుకున్నట్టుగానే ఓ వ్యక్తి వచ్చాడు. అప్పటికే.. ‘మా తమ్మునికి పిల్లను ఇవ్వడానికి ఓ వ్యక్తి వస్తున్నాడు.. మీ షాపులో మాకు వాటాలున్నాయని ఆయనకు చెప్పా.. దయచేసి సాయం చేయండ’ని చెప్పి ‘సాక్షి’ ప్రతినిధి తనకు పరిచయం ఉన్న సదరు వైన్స్ దుకాణం యజమానిని ఒప్పించారు. నకిలీ మద్యం గ్యాంగ్ లీడర్ పనుపున వచ్చిన వ్యక్తితో కలిసి దుకాణంలోకి వెళ్లాం. కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తులు ‘సాక్షి’ ప్రతినిధికి షాపు యజమానికి ఇచ్చే గౌరవం ప్రకారం లేచి నమస్కారం పెట్టారు. బార్ దగ్గర కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఈ రెండింటికి ‘సాక్షి’ ప్రతినిధే యజమాని అని.. గ్యాంగ్ లీడర్ ప్రతినిధి పూర్తిగా నమ్మాడు. అంతా చూసుకుని నిర్ధారించుకున్న తర్వాత ‘‘సరుకు ఎంత కావాలి?’’ అని మాఫియా లీడర్ ప్రతినిధి అడిగాడు. ‘‘పది రోజులకు లోడు చొప్పున కావాలన్నా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి చెప్పారు. ‘‘సరే! అన్నతో కలిసి ధర మాట్లాడుకుంటే రేపు ఉదయం సరుకు దింపుతాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

మళ్లీ గ్యాంగ్ లీడర్‌తో భేటీ...
మద్యం మాఫియా గ్యాంగ్ లీడర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి మళ్లీ కలిశారు. ఈసారి భేటీ ఉప్పల్‌లో జరిగింది. ‘‘రంగారెడ్డి జిల్లాలో ఆఫీసర్స్ చాయిస్ బాగా తాగుతారు.. అదే తీసుకో’’ అని అతడు సలహా ఇచ్చాడు. ‘సాక్షి’ ప్రతినిధి సరే అన్నారు. ‘‘గోవా సరుకు.. అక్కడి ఫ్యాక్టరీల నుంచే వస్తుంది. నువ్వేం ఫిక ర్ చేయాల్సిన పని లేదు. ఎక్సైజోడే గుర్తుపట్టలేడు. పోలీసోనికి దీని గురించి తెల్వనే తెల్వదు. ఓ లోడు సరుకు తీసుకో’’ అని గ్యాంగ్ లీడర్ చెప్పాడు. ‘‘ధర ఎట్టా? చెప్పండన్నా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి అడిగారు. ‘‘కేసుకు రూ. 2,500 పడుతుంది’’ అని అతడు చెప్పాడు. బేరమాడగా చివరకు కేసు రూ. 2,100 చొప్పున ఇచ్చేందుకు గ్యాంగ్ లీడర్ అంగీకరించాడు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షలు కట్టమన్నాడు. ‘‘మా పార్టనర్‌తో మాట్లాడి డబ్బు తీసుకుని రెండు రోజుల్లో వస్తా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి బదులిచ్చారు. శాంపిల్‌గా ముందు రెండు పెట్టెలు పంపాలని కోరారు. ‘‘పిచ్చోనివారా? ఇంత చెప్పినా శాంపిల్ పంపమంటావు’’ అని గ్యాంగ్ లీడర్ కోపగించుకున్నాడు. ‘సాక్షి’ ఎలాగోలా అతడిని ఒప్పించింది. అదే రోజు ఓ ఆటోలో రెండు ఆఫీసర్స్ చాయిస్ పెట్టెలు తెచ్చి ఇచ్చారు. పరిశీలనగా చూస్తే అవి ఏపీబీసీఎల్ నుంచి వచ్చిన మద్యం బాటిల్స్‌లానే ఉన్నాయి. లేబులింగ్‌లో తేడా లేదు. లేబుల్స్ మీద అలైడ్ బ్లెండర్స్ నందిగామ అని ఒక పెట్టెలో.. అలైడ్ బ్లెండర్స్ గగన్‌పాడు అని మరో పెట్టెలో ఉంది.
 
గోవా డిస్టిలరీల నుంచి ఏపీకి ఇలా..
గోవా నుంచి డిస్టిలరీ మద్యం నేరుగా రాష్ట్రానికి చేరుతోంది. మన రాష్ట్రంలో మద్యం తయారు చేయటానికి 31 డిస్టిలరీలు ఉన్నాయి. అదే గోవాలో 150 వరకు డిస్టిలరీలు ఉన్నాయి. అక్కడి రాష్ట్రంలో ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదు. దీంతో గోవా డిస్టిలరీలు పక్కదారి పడుతున్నాయి. ఈ డిస్టిలరీల నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నట్లు తేలింది. ఈ వ్యాపారం కూడా హవాలా పద్ధతిలో డబ్బు చేతులు మారుతూనే సాగుతుంది.
     

* అక్రమార్కులు ఏ బ్రాండు మద్యం కోరితే ఆ బ్రాండు మద్యాన్ని గోవాలో తయారు చేసి ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఓసీ, బీపీ, రాయల్ స్టాగ్ మద్యాన్ని ఎక్కువగా తయారు చేస్తున్నారు.
    
* అక్రమార్కులు తమకు కావలసిన బ్రాండు మద్యం బాటిళ్లు రెండు సేకరించి వాటిని ప్యాక్ చేసి గోవా డిస్టిలరీకి కొరియర్ చేస్తున్నారు. కొందరు బస్సు డ్రైవర్‌కు ఇచ్చి పంపుతున్నారు. ఎన్ని లారీల సరుకు కావాలో కోడ్ భాషలో లెటర్ రాసి కొరియర్‌లోనే పంపుతున్నారు.
     
* బాటిళ్లు తీసుకున్న గోవాలోని డిస్టిలరీ యాజమాన్యం.. అచ్చంగా ఆ బాటిళ్ల మీద ఉన్నటువంటి లేబుల్‌నే అచ్చుగుద్దుతోంది. కోరిన మద్యం తయారు చేసి సీల్ చేసి ప్యాక్ చేసి పంపుతోంది.
     
* ఇలా తయారు చేసిన మద్యాన్ని కంటెయినర్‌లో వేసి సీల్ చేస్తున్నారు. దీనికి ఏషియన్ పెయింట్ పేరు మీదనో, నూడుల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పేరు మీదనో గోవా నుంచి కటక్ వరకు రూట్ పర్మిట్ తీసుకుంటున్నారు.
     
* ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పట్టుబడితే దొరకకుండా ఉండేందుకు ప్రతి 100 కి లోమీటర్లకు ఒక డ్రైవర్‌ను మార్చుతున్నారు. ఒక డ్రైవర్‌కు మరో డ్రైవర్ వివరాలు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.
     
* ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్రోక్రాట్, బ్యాగ్ పైపర్ లాంటి మీడియం రకం మద్యానికి.. గోవా ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ డిస్టిలరీలకు ఒక్కో కేసుకు (క్వార్టర్ బాటిళ్లు అయితే 48, ఫుల్ బాటిళ్లు అయితే 12) రూ.450 చెల్లించి తీసుకుంటుంది. మన రాష్ట్రంలో ఈ కేసుపై నాలుగైదు రకాల పన్నులు విధించి.. ప్రివిలిజ్ ముగిసిన షాపులకు సుమారు రూ. 3వేలకు సరఫరా చేస్తుంది. వారు ఆ కేసుపై నిర్ణయించిన గరిష్ట విక్రయ ధర ప్రకారం రూ. 3,200 మొత్తానికి విక్రయిస్తారు.
     
* అదే గోవాలో అక్రమంగా మద్యం తయారు చేసే డిస్టిలరీ యాజమాన్యం.. తమకు ఆ ఆర్డర్ ఇచ్చిన మద్యం మాఫియాకు ఒక్కో కేసును రూ. 950 ధరకు అందిస్తుంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకొని ఆ మాఫియా ఒక్కో కేసును రూ. 1800 ధరకు మద్యం దుకాణానికి చేరవేస్తాడు. ఆ షాపుల వారు తమ షాపుల్లో విక్రయిస్తే ఎంఆర్‌పీ ధర రూ. 3,200కు అమ్ముతారు. బెల్టు దుకాణానికి ఇస్తే రూ. 2,900 కు విక్రయిస్తున్నారు.
     
* ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మద్యానికి ఒక్కో కేసుకు రూ. 3,000 వరకూ చెల్లించాల్సి వస్తుండగా.. అదే నకిలీ మద్యం కేసు కేవలం రూ. 1,800 ధరకే షాపుకు వచ్చి చేరుతోంది. దీనివల్ల షాపుయజమానికి ఒక్కో కేసుకు రూ. 1,000 కి పైగా ఆదాయం వస్తోంది. మద్యం మాఫియాకూ ఒక్కో కేసుకు మరో రూ. 1,000 మిగులుతోంది. గోవాలో అక్రమంగా తయారు చేసే డిస్టిలరీలకూ ఒక్కో కేసుకు రూ. 500 వరకూ అదనంగా గిడుతోంది.
 
ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ దందా..
మరో స్టింగ్ ఆపరేషన్‌లో ఎక్సైజ్ అధికారులు సూచించిన బ్రోకర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి పరిచయం చేసుకున్నారు. ‘‘మాది కరీంనగర్ జిల్లా బెజ్జంకి. గతంలో నకిలీ ఫారిన్ లిక్కర్ వ్యాపారం చేశాం. అందులో పెద్దగా లాభాలు రాలేదు’’ అని చెప్పి నమ్మబలికారు. ‘‘నకిలీ మద్యంలో మంచి లాభాలు ఉన్నాయని కనకం అన్న చెప్పాడు.. నిన్ను కలిస్తే దారి దొరుకుతుందని ఆయన చెప్తే నిన్ను వెతుక్కుంటూ వచ్చామన్నా’’ అని ఆయన్ను నమ్మించారు. ఐదు డ్రమ్ముల ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) కావాలని కోరారు.

లీటర్ మీద రూ. 4 కమీషన్ ఇస్తామని చెప్పారు. బ్రోకర్ ఒప్పుకున్నాడు. ఐదు డ్రమ్ములకు రూ. 1.65 లక్షలు అవుతాయని, దానికి సరిపోను క్యారామిల్, లేబుల్స్, సీల్స్, మూతలు, విస్కీ ఎసెన్స్‌కు కలిపి మరో 1.25 లక్షలు.. మొత్తం 3.75 లక్షలు డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఇప్పుడు డబ్బు ఇస్తే మూడు రోజుల తరువాత డ్రమ్ములు వస్తాయని చెప్పాడు. ‘‘అన్నా ఏ నమ్మకం లేకుండా ఇంత డబ్బు ఎలా ఇవ్వాగలం..? ఏదైనా నమ్మకం చూపించు’’ అని ‘సాక్షి’ ప్రతినిధి అడిగారు.

బ్యాంక్ స్ట్రీట్‌లో సెల్‌ఫోన్ షాపు...
సదరు బ్రోకర్ ఎట్టకేలకు ‘సాక్షి’ ప్రతినిధిని, ఆయన సహచరుడిని వెంటతీసుకెళ్లాడు. ఆబిడ్స్ చౌరస్తా నుంచి సితార రాయల్ హోటల్ దాటి.. బ్యాంకు స్ట్రీట్‌లో ఒక సెల్‌ఫోన్ షాపులోకి వారిని తీసుకువెళ్లాడు. షాపు సాదాసీదాగా ఉంది. పెద్దగా వ్యాపారం ఉన్నట్లు కనిపించలేదు. ఈ షాపు యజమాని పేరు సింగ్ (పూర్తి పేరు కాదు). ‘సాక్షి’ ప్రతినిధిని మద్యం వ్యాపారిగా ఆయనకు బ్రోకర్ పరిచయం చేశాడు. విషయం చెప్పాడు. ‘‘ఎప్పుడు తీసుకుంటారు?’’ అని సింగ్ అడిగాడు. ముందు ఒక డ్రమ్ము చాలు. తరువాత నాలుగు డ్రమ్ములు కావాలని ‘సాక్షి’ ప్రతినిధి చెప్పారు. ‘‘ఒక డ్రమ్మై వీఆర్‌ఎల్ పార్సిల్‌లో రెడీగా ఉంది. డబ్బు కట్టి వెళ్లి తీసుకోండి’’ అని సింగ్ చెప్పాడు. ఇంతలోనే గౌడ్ (పూర్తి పేరు కాదు) అనే వ్యక్తి రూ. 5 లక్షలు ఇచ్చి రెండు రోజుల్లో సరుకు కావాలన్నాడు. రెండు రోజుల్లో కష్టమని, మూడో రోజు వచ్చి తీసుకెళ్లాలని సింగ్ చెప్పాడు. ‘సాక్షి’ ప్రతినిధి సమక్షంలోనే సింగ్ ఎక్కడికో ఫోన్ చేసి.. రూ. 6 లక్షలు ముట్టినవి.. 9 కాటన్లు, సర్జికల్ కిట్లు పంపాలని హిందీలో చెప్పాడు.

కర్ణాటక సెల్ నంబర్లకు ఫోన్లు...
‘సాక్షి’ ప్రతినిధి సదరు సింగ్‌ను మాటల్లో పెట్టి అదును చూసి ఆయన మాట్లాడిన ఫోన్ నంబర్‌ను సంపాదించారు. ఆ నంబర్ 09916044258. ఇది కాకుండా ఇంకో మూడు నంబర్లు ఉన్నాయి. అవి 08971609984, 09742570372, 09742570887. ఈ అన్ని నంబర్లు కూడా కర్ణాటక రాష్ట్రం నంబర్లే అని తేలింది. ఆ తర్వాత సింగ్‌తో పాటు ‘సాక్షి’ ప్రతినిధి వీఆర్‌ఎల్ పార్సిల్‌కు వెళ్లారు. అప్పటికే ఆయనకు కొరియర్ ద్వారా రశీదులు వచ్చినట్టున్నాయి. వెళ్లి కొరియర్ వాళ్లకు రశీదు ఇవ్వగానే ఆ రశీదును బట్టి డ్రమ్ము ఇచ్చారు. మరో రశీదు ఇస్తే సర్జికల్ కిట్ అని ఉన్న కవర్ ఇచ్చారు. డ్రమ్ము మీద ఉన్న లేబుల్‌పై ‘బ్యూటేన్, బాలాజీ ట్రేడర్స్, కాటేదాన్’ అని ఉంది. సర్జికల్ కిట్‌లో లిక్కర్ లేబుల్స్, క్యాప్ సీల్స్, మూతలు, విస్కీ ఎసెన్స్, క్యారామిల్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని ‘సాక్షి’ ప్రతినిధి రహస్యంగా చిత్రీకరించారు. రేపు వచ్చి సరుకు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు.
 
ఇథైల్ స్థానంలో మిథైల్ కలిస్తే ప్రాణాంతకం..!
ఈ అక్రమ, నకిలీ మద్యం దందాలో కీలకమైన విషయం ఏమిటంటే.. డిస్టిలరీల్లో మద్యం తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలనే దొంగతనంగా తెప్పించి, రహస్యంగా తయారు చేసి, నకిలీ లేబిళ్లు వేసి విక్రయిస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్‌ను శుద్ధిచేస్తే ఈఎన్‌ఏ అవుతుంది. ఇక్కడే పెను ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ స్థానంలో పొరపాటున మిథైల్ ఆల్కహాల్ వస్తే.. ఇక అంతే సంగతులు. దానితో చేసిన మద్యం తాగిన వారందరూ మృత్యువాతపడతారు. ఇదే కారణంతో గతంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గంగలకుర్తిలో నకిలీ మద్యం తాగి 18 మంది చనిపోయారు. గత ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో మరో 13 మంది గిరిజనులు కూడా ఇలాంటి నకిలీ మద్యం తాగి చనిపోయారు. డిస్టిలరీల్లో కాకుండా వెలుపల దొంగతనంగా తయారు చేసే నకిలీ మద్యంతో ఈ ప్రమాదం ఎల్లప్పుడూ పొంచే ఉంటుంది.
 
మన డిస్టిలరీల్లో ప్రతి చుక్కకూ లెక్క..!
రాష్ట్ర డిస్టిలరీల నుంచి మద్యం అక్రమంగా బయటికి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎక్సైజ్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి.  ప్రతి డిస్టిలరీ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, కనీసం ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, ఆరు మంది కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో ఉంటుంది. తరచుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు ఉంటాయి. లిక్కర్ తయారీకి ముడి పదార్థం ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ). ఇది ఎక్సైజ్ అధికారుల అధీనంలో ఉంటుంది. డిస్టిలరీ యాజమాన్యం ఉపయోగించిన ప్రతి చుక్క ఈఎన్‌ఏను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు. యాజమాన్యం ఈఎన్‌ఏ వినియోగానికి ఎక్సైజ్ కమిషనర్ నుంచి అనుమతి పొందిన దాని కంటే ఎక్కువగా వినియోగించటానికి అనుమతించరు.

ఒకవేళ అనుమతించినా వెంటనే దొరికిపోతారు. స్టాకు వివరాలను ఉదయం ఓపెనింగ్ రీడింగ్, రాత్రి క్లోజింగ్ రీడింగ్‌ను రికార్డు చేస్తారు. ఆ రోజు వినియోగించిన మొత్తం ఈఎన్‌ఏ రీడింగ్ కూడా నమోదు చేస్తారు. వాటి ద్వారా వచ్చిన లిక్కర్ కేసుల వివరాలు రికార్డు చేస్తారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా వెంటనే తెలిసిపోతుంది. అదే జరిగితే ముందు ఎక్సైజ్ అధికారుల మీద తక్షణ వేటు పడుతుంది. తరువాత డిస్టిలరీ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రంలో డిస్టిలరీ యాజమాన్యాలు మద్యాన్ని కానీ, ఈఎన్‌ఏను కానీ అక్రమంగా బయటికి పంపడానికి సాహసించ వు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement