సాక్షి నెట్‌వర్క్: రాష్ర్ట విభజనను అడ్డుకోకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు శుక్రవారం సమైక్య సెగ తగిలింది. పలు జిల్లాల్లో మంత్రుల ఇళ్లను, పార్టీ కార్యాలయాలను ముట్టడించారు. కర్నూలులో మంత్రి టీజీ వెంకటేష్‌కి చెందిన హోటల్ మౌర్య ఇన్‌పై దాడి చేశారు. కేంద్రమంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి నివాసంపై దాడికి యత్నించిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఆత్మకూరులో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నివాసం ఎదుట విద్యార్థులు దీక్ష చేశారు.
వైఎస్సార్ జిల్లా కడపలో డీసీసీ కార్యాలయంపై విద్యార్థులు రాళ్లతో దాడికి దిగారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విశాఖజిల్లా నర్సీపట్నం,పాడేరులో మంత్రి బాలరాజు ఇంటిని ముట్టడించారు. చోడవరంలో ఎమ్మెల్యే కన్నబాబు కారును అడ్డుకున్నారు. కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. మలికిపురంలోని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు. రాజమండ్రిలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటిని, రంపచోడవరంలో ఎంపీ రత్నాబాయి, ఎమ్మెల్యే కాశీ విశ్వనాథ్‌ల ఇళ్లను ముట్టడించారు. జేఎన్‌టీయూకే విద్యార్థులు కాకినాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.
కొత్తపేటలో కాంగ్రెస్ కార్యాలయం గోడలు బద్దలు కొట్టి, లోపలకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. కార్యాలయానికి నిప్పు పెట్టే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కృపారాణి క్యాంప్ కార్యాలయాన్ని, పాతపట్నంలో మంత్రి శత్రుచర్ల క్యాంప్ ఆఫీసును ఉద్యమకారులు ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్లు రువ్వి ఆద్దాలు ధ్వంసంచేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని, గుంటూరులో మంత్రి కన్నా ఇంటిని, ముట్టడించేందుకు ప్రయత్నించిన ఎన్జీవోలను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. కృషా ్ణజిల్లా విజయవాడలో నగర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
సీమాంధ్ర నేతలపై జనాగ్రహం
Published Sat, Oct 5 2013 3:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement