పీలేరులో నీళ్ళూ కొనాల్సిందేనా! | Samaikya Sankharavam coductted in Piler constituency | Sakshi
Sakshi News home page

పీలేరులో నీళ్ళూ కొనాల్సిందేనా!

Published Fri, Jan 10 2014 2:51 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి - Sakshi

వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో బిందె నీళ్లు మూడు రూపాయలకు కొనాల్సి వస్తోందా? అని వైఎస్సార్ సీపీ అ ధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన మూడో విడత చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా ఐదో రోజైన గురువారం పీలేరులో భారీ జనసందోహం మధ్య ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ప్రతి అంశానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పీలేరులో బిందె నీరు ఎంతకు కొంటున్నారని అడిగితే కొంతమంది రెండు రూపాయలని, మరికొంతమంది మూడు రూపాయలని, మరికొంతమంది ఐదు రూపాయలని సమాధానమిచ్చారు.

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా నీళ్లు కొనాల్సి వస్తోందని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. మూడు నా లుగు గంటలు మాత్రమే రైతులకు కరెంటు ఇస్తున్నారని తెలిపారు. కరెంటు బిల్లు తాకితేనే షాక్ కొడుతోందన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడంతో, ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. దీనికి ప్రజలు అవునన్నారు. ఈ సభలోని వారి ప్రతి గుండెచప్పుడు జై సమైక్యాంధ్ర అని కోరుకుంటోందని అన్నారు. విభజన కు వ్యతిరేకంగా తీర్మానం చేయమని అడిగితే కాంగ్రెస్, టీడీపీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం నినదించే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ  మాత్రమేనని తెలిపారు.

 ఒక్క తాటిపై నిలిచినందుకు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబా బు నాయుడు ఇద్దరూ శాసనసభకు వెళ్లకుండా, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి, సీమాంధ్రులతో సమైక్యమని, తెలంగాణ వారితో తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటూ, సొంత పార్టీ నాయకులనే మభ్యపెడుతున్నారని తెలిపారు. ఇందుకు ప్రజల నుంచి అవునని స్పందన వచ్చింది. కేంద్రం నుంచి వ చ్చిన బిల్లును వెనక్కు పంపాల్సింది పోయి, శాసససభలో చర్చించాలని పట్టుబడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీలు కోరుతున్నారు అనగానే ‘జై సమైక్యాంధ్ర’ అని ప్రజలు నినాదాలు చేశా రు. గురువారం సదుం, పీలేరు, దామలచెరువులో బహిరంగ సభలు జరిగాయి.

ప్రతి సభకూ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి తమ మద్దతు తెలియజేశారు.  ఘనంగా స్వాగతం పలికారు. ఈ బహిరంగసభల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ సమన్వయకర్తలు ఆర్‌కె.రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, షమీమ్ అస్లాం, మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు వై.సురేష్, బాబ్‌జాన్, జీవరత్నం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement